ఫోన్ ‘బీప్’మంటే ఎఫ్‌బీ తెరిచా. దీపిక నా ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని ఆమోదించిన నోటిఫికేషన్ అది. గుండెలో కోటి గిటార్లు మోగాయి. నాలుగేళ్ల కిందటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయా. దీపిక మా ఊరి చక్కదనాల చుక్క. తను కాలు బయట పెడితే కుర్రాళ్లంతా వీధుల్లోనే ఉండేవారు. ఆమె ఎవరి వంకైనా కన్నెత్తి చూస్తే.. వాడి జన్మ ధన్యమైనట్టే. అలా భావించేవాళ్లలో నేనూ ఒకడ్ని. ఆరోజు శ్రీరామనవమి. ‘బాబూ.. పక్క ఊరి రామాలయంలో సీతారాముల కల్యాణం జరుగుతోందట. నన్నక్కడ దిగబెడతావా?’ అంది దీపిక అమ్మమ్మ. అడిగిందే ఆలస్యం.. బండి తీస్కెళ్లి వాళ్ల ఇంటి ముందు నిలిపా. సంప్రదాయ సింగారంలా.. అలంకరించుకొని వచ్చింది నా బంగారం. వాళ్ల అమ్మమ్మతో పాటు నా బండి ఎక్కి కూర్చుంది. అది కలా? నిజమా? కాసేపటి దాకా నమ్మలేకపోయా. తేరుకొని గాల్లో తేలిపోయా. అప్పుడే తను రోజూ నా బైక్ ఎక్కాలని మనసులోనే మొక్కుకున్నా.
వర్తమానంలోకి వస్తే.. తనిప్పుడు నా ఎఫ్‌బీ స్నేహితురాలు. ఆలస్యం చేయకుండా ‘హాయ్’ అన్నా. అంతే వేగంగా ‘హలో’ చెప్పింది. తను ఆన్‌లైన్‌లో ఉంటే నా వేళ్లలో కరెంట్ పాకేది. తన మెసేజ్ కనిపిస్తే నా కళ్లలో కాంతులు. కాలేజీ.. సినిమాలు.. ఆసక్తులు.. చిన్ననాటి కబుర్లు.. కొద్దిరోజుల్లోనే అన్నీ పంచుకున్నాం. అదేసమయంలో నా అదృష్టంకొద్దీ వేలంటైన్స్ డే వచ్చింది. ఆలస్యం చేయకుండా నా మనసుని తన ముందుంచా. ఏదీ చెప్పకుండా మూగనోము పట్టింది. నాకేమో గుండెదడ పెరగసాగింది. ఎట్టకేలకు ఓ గంటయ్యాక ‘నువ్వు మంచి ఫ్రెండ్‌వి. వేరే ఉద్దేశం పెట్టుకోవద్ద్దు’ అని సందేశం పంపింది. నేను వెనక్కి తగ్గలేదు. మళ్లీమళ్లీ ప్రయత్నించా. తను సైలెంట్ అయిపోయేది. ఆలోచిస్తే.. నేనంటే తనకి ఇష్టం లేదేమో అనిపించింది. మాట్లాడ్డం ఆపేశా.
కొద్దిరోజులయ్యాక నేను ఊహించని రీతిలో రియాక్టై ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అంది. నాకు షాక్. ప్రేమ తర్వాత మజిలీ పెళ్లే కదా.. అందుకే అలా అడిగానంది. అదృష్టం కోరి వరిస్తానంటే ఎవరు కాదంటారు? ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుండగానే కరోనా వచ్చి పడింది. మా అన్నయ్య కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరాడు. నేనే చూసుకునేవాడిని. ఆ సమయంలో దీపిక ఎన్ని జాగ్రత్తలు చెప్పేదో! ఇదిలా ఉండగానే ‘ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నన్నెలా పోషిస్తావ్? మావాళ్లతో నీ గురించి ఏం చెప్పను?’ అందోసారి. ఆ మాటకి నా దగ్గర సమాధానం లేదు. ఇంట్లో పరిస్థితి బాగానే ఉండటంతో అసలు ఉద్యోగం చేయాలనే ఆలోచనే రాలేదు నాకు. తన మాటతో రంగంలోకి దిగా. నా ప్రేమ శక్తి గొప్పదేమో.. అలా ప్రయత్నించగానే ఇలా కొలువు దొరికింది.