అమ్మ చేసిన ముస్తాబులో అందమంతా తనదే అనేలా వెలిగిపోయేవాడు ఆ బుడ్డోడు. బుడిబుడి అడుగులు వేస్తుంటే.. ఆ తల్లిదండ్రుల ఆనందం అంతాఇంతా కాదు. ముద్దుముద్దు మాటలు వింటూ మురిసిపోయేవారు. తమ కలలపంటను అల్లారుముద్దుగా పెంచి, ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు. అంతలోనే కుమారుడికి కొండంత కష్టమొచ్చింది. చిన్నా... అని పిలవగానే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చే బుజ్జాయి ఇక నడవలేడని అమ్మానాన్నల గుండెలు పగిలిపోయాయి. బిడ్డతో పాటు తమ జీవితాలూ విద్యుదాఘాతం వల్ల తలకిందులయ్యాయంటూ ఆ దంపతులు రోదిస్తున్న తీరు హృదయాల్ని ద్రవింపజేస్తోంది... తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి వినోద్ లారీ డ్రైవర్. భార్య చాందిని గృహిణి. పెద్ద కుమారుడు అక్షిత్ యూకేజీ చదువుతున్నాడు. రెండోకుమారుడు దర్శిత్‌కు మూడేళ్లు. ఈనెల 12న భవనంపై దుస్తులు ఆరేయడానికి తల్లితోపాటు దర్శిత్ కూడా వెళ్లాడు. ఆమె పనిలో నిమగ్నమై ఉండగా ఆ చిన్నారి అక్కడున్న 33కేవీ విద్యుత్తు తీగల సమీపానికి వెళ్లి, విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. అప్పటివరకు ఆడుకుంటున్న కుమారుడు పడిపోవడంతో చాందిని ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కాకినాడలోని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు.
మోకాళ్ల వరకు తొలగింపు..:నాలుగు రోజుల చికిత్స అనంతరం ఇన్‌ఫెక్షన్ సోకడంతో బాలుడికి రెండు కాళ్లూ మోకాళ్ల కింది వరకు తొలగించారు. కొన్ని రోజులు పరిశీలనలో ఉండాలని, ఇన్‌ఫెక్షన్ తగ్గకపోతే మోకాళ్లనూ తొలగించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తమ కుమారుడికి వచ్చిన కష్టం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
చేతిలో చిల్లిగవ్వలేదు..:రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం.. కుమారుడి కోసం ఆసుపత్రి దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఉన్న కాస్త బంగారాన్నీ తాకట్టు పెట్టి రూ.35 వేలకు పైగా ఖర్చు చేశారు. రోజూ మందులకే రూ.10 వేలకు పైగా అవుతోందని, ముందుముందు ఇంకెంత ఖర్చు అవుతుందో తెలియదని వాపోతున్నారు. మెరుగైన వైద్యం కోసం వేరేచోటకు తరలిస్తే రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని, తమ దగ్గర అంత మొత్తం లేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు. దాతలు ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నారు.
పదేళ్ల నుంచి పోరాటం చేసినా..:పదేళ్ల క్రితం ఆ ఇంటిస్థానంలో పూరిపాక ఉండేది. అప్పుడు వద్దని మొత్తుకున్నా విద్యుత్తుశాఖ అధికారులు పాక మీదుగా 33 కేవీ విద్యుత్తు లైన్లు వేశారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటిని తొలగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. మూడు నెలల కిందట ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో సమస్యను హోంమంత్రి తానేటి వనితకు విన్నవించామని, అయినా పరిష్కారం కాలేదని బాధితులు వాపోయారు. అప్పుడే పట్టించుకుని ఉంటే ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.