రాష్ట్ర అడవుల్లో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రత కారణామా లేక మానవ తప్పిదమా అంటూ ఈనాడు ప్రత్యేక ప్రతినిధులు ఇటీవల అమ్రాబాద్ పులుల అభయారణ్యం నుంచి పర్యటించారు. అప్పడు పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ఆకులు రాలే కాలానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తోడవడం వల్ల తెలంగాణ అటవీ ప్రాంతాలు భగ్గుమంటున్నాయి. ఒక్క శనివారం రోజే రాష్ట్రవ్యాప్తంగా అటవీప్రాంతాల్లో 24 చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ సంవత్సరంలో ఒకే రోజు ఇన్ని ప్రమాదాలు సంభవించడం ఇదే తొలిసారి. జగిత్యాల జిల్లాలో 4, నాగర్‌కర్నూల్‌లో 3, పెద్దపల్లిలో 3, సిరిసిల్లలో 2, కొత్తగూడెంలో 2, మెదక్‌లో 2, ములుగులో 2, మహబూబాబాద్‌లో 2, వికారాబాద్‌లో 2, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి చొప్పున ప్రమాదాలు జరిగాయి. ఎస్‌ఎన్‌పీపీ, మోదీస్ ఉపగ్రహాల ద్వారా ఈ ప్రమాదాల సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అప్రమత్తమై వెంటనే మంటల్ని ఆర్పేందుకు సిబ్బందిని రంగంలోకి దింపింది.
మరికొన్ని మంటలు చేలరేగిన ఘటనలు
- శ్రీశైలం రహదారి వెంట కిలోమీటర్ల మేర అడవి కాలిపోయింది.
- మన్ననూరు నుంచి దోమలపెంట వరకు 55 కి.మీ. పొడవునా అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
- నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఉరుమండ సమీపంలో ఈనెల 4న, గతంలో మూడు రోజుల ముందు ఎర్రకురువలో రెండు భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి.
- వటవార్లపల్లి-దోమలపెంట వరకు రహదారికి ఇరువైపులా అనేకచోట్ల అడవి కాలిపోయింది. అదె బీట్‌లో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. 12వ తేదీన కూడా మరో ప్రమాదం కూడా జరిగింది.
మంటల్లో జంతువులు..
అగ్నిప్రమాదాల్లో కొన్ని రకాల జంతువులు మంటల కారణంగా మరణిస్తున్నాయి. కాలిన ప్రాంతంలో మొలిచే పిచ్చి గడ్డిని జింకలు, మనుబోతులు, కుందేళ్ల వంటివి తినలేక ఆహారం కోసం వలస పోతున్నాయి. వీటిని వేటాడి బతికే తోడేళ్లు, రేసుకుక్కలు, చిరుతలు, పులుల వంటివి కూడా అడవిని వీడిపోతున్నాయి. పెద్దపులులు సంచరించే కవ్వాల్, అమ్రాబాద్ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా అమ్రాబాద్ అభయారణ్యంలో పెద్దపులుల సంఖ్య 20కి మించకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.
మానవ తప్పిదమేనా?
డిసెంబరు నెలాఖరు నుంచి ఆకులు రాలే కాలం. జనవరిలో మొదలైన.. ఈ ప్రమాదాలు ఫిబ్రవరిలో పెరిగాయి. ఏటా జరిగే ప్రమాదాల్లో 50 శాతం మార్చిలోనే ఉంటున్నాయి. గొర్రెల కాపరులు, అటవీ మార్గంలో ప్రయాణించేవారు సిగరెట్లు తాగి, వంటలు చేసుకుని నిప్పును ఆర్పకపోవడం వంటివి ప్రమాదాలకు దారితీస్తున్నాయి.