రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులకు తీసుకువచ్చిన టీఎస్-బీపాస్ విధానంలో ఇప్పటివరకూ సుమారు 900కి పైగా భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు. మూడు వారాల నుంచి టీఎస్-బీపాస్ కింద భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్న విషయం తెలిసిందే. వీటిలో 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలకు కేవలం పదిలోపే దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మిగిలినవి అన్నీ 75, 600 చదరపు గజాల్లోపు ఉన్నవే. 75 చదరపు గజాల్లోపు ఉన్నవాటికి నమోదుతోనే నిర్మాణ అనుమతి మంజూరవుతుండగా, 75 నుంచి 600 చదరపు గజాల్లోపు వాటికి నిర్దేశించిన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి ఫీజులు చెల్లించిన వెంటనే అనుమతులు మంజూరవుతున్నాయి.
బీపాస్ ఆన్‌లైన్ అనుమతులకు అందజేస్తున్న వివరాలను, లింక్ డాక్యుమెంట్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనుమతుల కోసం స్థలాలను తక్కువ విస్తీర్ణంతో విడగొట్టి దరఖాస్తు చేస్తున్నవి ఉంటున్నాయా? అనేది పక్కాగా పరిశీలిస్తున్నారు. నిర్మాణ, జోనింగ్ నిబంధనలు, మాస్టర్‌ప్లాన్ ప్రకారం భూవినియోగ నిబంధనలు, ప్రభుత్వ భూములు వంటి వాటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేస్తున్నట్లు పురపాలక అధికారి తెలిపారు.