ప్రయాణాల్లో స్వీయజాగ్రత్తలు తీసుకోవడం కచ్చితంగా అవసరమే. వాటిని ఉల్లంఘించినప్పుడు మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల మేరకు జరిమానాలు విధించడమూ అవసరమే. ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ఎవరూ కాదనరు. కానీ కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బిక్కచచ్చిపోయిన ప్రజలపై ఈ జరిమానాల భారం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. తమ ప్రయత్నమంతా వాహనదారుల ప్రాణరక్షణ కోసమే అని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నా... మధ్యతరగతి వాహనదారులకు ఇవి మోయలేని భారంగా మారుతున్నాయి.
అద్దం లేదని 3 లక్షలకు పైగా చలాన్లు
సాధారణంగా ద్విచక్రవాహనదారుడు శిరస్త్రాణం ధరించకుండా ప్రయాణించిప్పుడు జరిమానాలు విధిస్తే ఎవరూ తప్పు పట్టరు. కానీ కరోనా కష్టకాలంలో వాహనానికి సైడ్ మిర్రర్ లేదని... పెట్టుకున్న శిరస్త్రాణం సరిగా లేదని... వెనక కూర్చున్న వ్యక్తికి శిరస్త్రాణం లేదనే కారణాలతో జరిమానాలు విధిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. ఈ 50 రోజుల వ్యవధిలోనే ఏకంగా 9లక్షల పైచిలుకు చలాన్లు విధించారు. వీటిలో అద్దం లేని కారణానికితోడు వెనకు కూర్చున్న వ్యక్తికి శిరస్త్రాణం లేదనే కారణంతో సుమారు 3.28లక్షల చలాన్లు జారీ చేయడం గమనార్హం.