రాష్ట్రంలో మరో 869 మంది కరోనా బారిన పడినట్లు వైద్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,05,123మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 869 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 1178 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు స్పష్టం చేసింది. తాజా కేసులతో ఇప్పటి వరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 6,24,379కి చేరింది.
మహమ్మారి కోరల్లో చిక్కి మరో 8 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,669కి చేరింది. మరో 1,197 మంది కోలుకున్నారు. మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,07,658కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,052 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 97.32 శాతానికి పెరిగింది.