కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలబడుతున్న పోలీసులే ఆ వ్యాధికి ఎక్కువగా గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దాదాపు 800 మందికి వైరస్ సోకింది. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 761 మంది పోలీసులు కొవిడ్‌కు గురయ్యారు. కోలుకున్న వారు తిరిగి విధులకు హాజరవుతుండగా.. మరికొందరు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇంకొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఎక్కువమంది క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఉండడం గమనార్హం. మరే ప్రభుత్వ విభాగంలోనూ ఇంతమంది కరోనా పీడితులు లేరంటేనే పోలీసు శాఖ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆరుగురు పోలీసులు చనిపోయారు. నమోదైన కేసుల్లో ఒకటీ అరా మినహా మిగతావన్నీ రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందినవే. బాధితుల్లో నలుగురు ఐపీఎస్ అధికారులు ఉండగా వారంతా కోలుకొని తిరిగి విధులకు హాజరవుతున్నారు.
పాతబస్తీలోనే అత్యధికం..
- హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాధితుల్లో 288 మంది దక్షిణ మండలానికి చెందిన వారే.
- మొత్తం బాధితుల్లో 479 మంది కానిస్టేబుళ్లు, 124 మంది హోంగార్డులు, 51 మంది హెడ్‌కానిస్టేబుళ్లు 43 మంది ఉన్నారు.
- 613 మంది ఇంట్లోనే క్వారంటైన్ కాగా 83 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
- 126 మంది కోలుకుని బయటపడగా 59 మంది విధులకు హాజరవుతున్నారు.
- మొత్తం బాధితుల్లో 264 మంది ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు తేలింది.