77th Independence Day Celebrations At Golconda Fort : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ముందుగా అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో జెండా ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు. అక్కడ వీరుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటంచాక.. గోల్కొండ కోటకు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్స్‌లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం ఆ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం చేయనున్న ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. 20 నిమిషాలకు పైగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉండవచ్చని తెలుస్తోంది. సాయంత్రం రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరగనుంది.
"800 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. అక్టోపస్ నుంచి 30 మంది నుంచి 40 మంది వరకు ఉన్నారు. 300 మంది వరకు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. లంగర్‌హౌజ్ నుంచి ట్రాఫిక్ అంక్షలు విధించాం. ప్రజలు ఈ పరిసరాల్లోకి రావొద్దు." -కిరణ్, డీసీపీ,హైదరాబాద్ నైరుతి జోన్
Bheema Facility To Panchayathiraj Employees : ఇదిలా ఉండగా.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు.. బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. పంచాయతీ కార్మికులు మరణిస్తే.. రూ.5 లక్షల బీమా వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కార్మికుల తరఫున.. ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. రాష్ట్రంలోని 51 వేల మంది పంచాయతీ కార్మికులకు బీమా సౌకర్యం వర్తించనుంది. పంచాయతీ కార్మికుల అంత్యక్రియలకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.5 వేలను రూ.10 వేలకు పెంచారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.