రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమానికి అందరం పునరంకితం అవుదామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం సిద్దించినట్లు అని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సభాపతి పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
135కోట్ల భారత పౌరులకు, రాష్ట్రంలోని సోదరసోదరీమణులకు పేరు పేరున 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జరుపుకునే పండుగ ఇది. మహాత్మ గాంధీ అహింస మార్గాన తీసుకొచ్చిన స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం. పోటీపడి రాష్ట్రాలను అభివృద్ధి చేసుకునేలా పని చేయాలే తప్ప అడ్డంకులు సృష్టించవద్దు. ఏడేళ్లలో తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా నిలిచింది. శాంతి భద్రతల కోసం పోలీసు వ్యవస్థ నిరంతరం పనిచేస్తోంది. ప్రభుత్వం యంత్రాగం, పోలీసులకు అభినందనలు.
-పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభాపతి
మండలిలో వేడుకలు
శాసనమండలిలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. మహాత్మాగాంధీ విగ్రహానికి మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఛైర్మన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన అన్నారు.
సేవలు మరువం
అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
జీహెచ్‌ఎంసీలో
జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. అధికారులు, కార్పొరేటర్లతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు.