కరోనా మహమ్మారి నగరంలోని పలు బస్తీల్లో తిష్ఠవేసి అక్కడక్కడే విస్తరిస్తోంది. గత నెల రోజులుగా కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట, జియాగూడ తదితర ప్రాంతాల్లోని బస్తీల్లో నిత్యం కేసులు వెలుగుచూస్తున్నాయి. వారాంతపు సంతలు, నియంత్రణ లేకుండా దుకాణాల నిర్వహణ, జనం గుంపులుగా తిరుగుతుండటంతో బస్తీల్లో వ్యాప్తి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
కాస్త ఊరట
గ్రేటర్ వ్యాప్తంగా శనివారం 736 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 9 మంది మృతిచెందగా వీరిలో ఓ బాలింత(22) కూడా ఉందని పేర్కొన్నారు. అనుమానిత లక్షణాలున్నవారు దగ్గర్లోని కొవిడ్ పరీక్ష కేంద్రాలను ఆశ్రయించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈనెల 8న 1,590 కేసులు నమోదైతే, 9న 918, 10న 762 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. శనివారం ఆ సంఖ్య ఇంకాస్త తగ్గడం కొంతమేర ఊరటనిచ్చింది. అంబర్‌పేట సర్కిల్‌లో కొత్తగా 29 మందికి వైరస్ సోకింది. కాచిగూడ చప్పల్‌బజార్‌లో ఒకరు, అంబర్‌పేట ప్రేంనగర్‌లో ఒకరు, తురాబ్‌నగర్‌లో ఒకర్ని కరోనా బలిగొంది. బస్తీల్లో వైరస్ విజృంభిస్తోందని చెప్పేందుకు అంబర్‌పేట సర్కిల్ ఉదాహరణ. ఈ సర్కిల్‌లోని సుమారు 23 బస్తీల్లో నిత్యం లెక్కకు మించి మహమ్మారి బారిన పడుతున్నారు.