ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చిత్తూరు జిల్లాలో ఒకేరోజు 25 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.... అందులో 24 శ్రీకాళహస్తిలోనే కావడం కలవరపాటుకు గురిచేసింది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రంగంపేటలో మరో కేసు నమోదైంది. వైరస్ బారిన పడిన వారిలో 12 మంది ఉద్యోగులు ఉన్నారని... ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకిందని కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు తరలించామని కలెక్టర్ తెలిపారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిండ్ర, నారాయణవనం, పిచ్చాటూరు మండలాలను రెడ్‌జోన్ పరిధిలో చేర్చామని... అలాంటి చోట్ల ర్యాండమ్ శాంపిల్ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో ఇప్పటిదాకా 53 పాజిటివ్ కేసులు నమోదవగా... అందులో నలుగురు ఆరోగ్యం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు.
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ విజృంభించాయి. మరో 20 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీనిద్వారా మొత్తం కేసుల సంఖ్య 149కి చేరింది. ఇప్పటివరకూ గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో కేసుల తాకిడి ఉండగా... గుంటూరు గ్రామీణ ప్రాంతానికీ విస్తరించాయి. 20 కొత్త కేసులు కూడా నరసరావుపేట పురపాలిక పరిధిలోనే కావడం వల్ల స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రామిరెడ్డిపేట, వరవకట్ట ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి... నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే 18 ట్రూనాట్ మిషన్ల ద్వారా వైరస్ నిర్ధరణ పరీక్షలు జరుపుతుండగా... జిల్లాకు 12వేల 590 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు చేరాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ కిట్ల ద్వారా రెడ్‌జోన్ల పరిధిలోని 3వేల 228 మంది అనుమానితులకు పరీక్షలు జరపాలని నిర్ణయించారు.
కర్నూలు జిల్లాలో సోమవారం మరో 16 పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం కేసుల సంఖ్య 174కు చేరింది. జిల్లాలో కరోనా బారిన పడి ఇప్పటిదాకా ఐదుగురు చనిపోయారు. ఇక వైరస్ నుంచి కోలుకుని సోమవారం ముగ్గురు వ్యక్తులు నంద్యాల కొవిడ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో... ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు. కేసుల పరంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న కర్నూలు జిల్లాలో అత్యధిక పరీక్షలు చేస్తున్నామని... కర్నూలు సర్వజన వైద్యశాలను కొవిడ్ ఆసుపత్రిగా మార్చుతున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు.