New railway line : రెండు నెలల్లో 71 కి.మీ. కొత్త రైల్వేమార్గం.. తుది దశలో డబ్లింగ్ పనులు - కొత్తగా 71కిలోమీటర్ల రైల్వేలైన్
New railway line : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండు నెలల వ్యవధిలో 71 కి.మీ. నూతన రైలు మార్గం, 187.14 కి.మీ. మేర రెండో లైను మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. తుది దశలో ఉన్న వీటి పనులు ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి కానున్నట్లు సమాచారం. ఇది సిద్ధమైతే, ఆయా మార్గాల్లో ప్రయాణికుల రైళ్ల వేగం పెరగడంతో పాటు అదనంగా మరికొన్ని రైళ్లనూ ప్రవేశపెట్టేందుకు వెసులుబాటు లభిస్తుంది.
New railway line
By
Published : Feb 13, 2022, 7:32 AM IST
New railway line : రెండు నెలల వ్యవధిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 71 కి.మీ. నూతన రైలు మార్గం, 187.14 కి.మీ. మేర రెండో లైను మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. తుది దశలో ఉన్న వీటి పనులు ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి కానున్నట్లు సమాచారం.
రాయలసీమ, బెంగళూరు వైపు..
సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ (85 కి.మీ.) డబ్లింగ్, విద్యుదీకరణ పనులు తుది దశలో ఉన్నాయి. ఉందానగర్-గొల్లపల్లి వరకు 60 కి.మీ. మార్గం కొద్దికాలం కిందటే పూర్తయ్యింది. మిగిలిన 25 కి.మీ.ల్లో మహబూబ్‌నగర్-దివిటిపల్లి మధ్య 10.5 కి.మీ. పనులు తాజాగా పూర్తయ్యాయి. దివిటిపల్లి-గొల్లపల్లి మధ్య చివరి దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రెండో లైను అందుబాటులోకి వస్తుంది. అదనంగా ప్యాసింజర్ రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్-మహబూబ్‌నగర్ మధ్య నిత్యం రాకపోకలు సాగించే వేల మందికి ప్రయాణం సులభతరమవుతుంది.
డోన్ వరకు రెండో లైను మంజూరైతే..
మహబూబ్‌నగర్ నుంచి ఏపీలోని డోన్ వరకు సింగిల్ లైనే ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి డోన్ వరకు డీజిల్ ఇంజిన్‌తో.. అక్కడి నుంచి విద్యుత్ ఇంజిన్లతో రైళ్లు నడుపుతున్నారు. రెండో లైను మంజూరైతే రాయలసీమకు, బెంగళూరుకు రైలు ప్రయాణం మరింత వేగవంతమవుతుంది. *విజయవాడ-గుడివాడ/మచిలీపట్నం-భీమవరం/నర్సాపూర్-నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనుల్లో విజయవాడ-గుడివాడ-భీమవరం 109 కి.మీ., గుడివాడ-మచిలీపట్నం మధ్య 35 కి.మీ. మేర డబ్లింగ్, విద్యుదీకరణ ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన సెక్షన్లలో 77 కి.మీ. మేర పనులు తుది దశలో ఉన్నాయి. *గుత్తి-ధర్మవరం 91 కి.మీ. డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో 57 కి.మీ. మేర పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 20.59 కి.మీ. పనులు చివరి దశలో ఉన్నాయి.
రెండు నూతన మార్గాల్లో..
భద్రాచలం రోడ్-సత్తుపల్లి 54 కి.మీ. కొత్త లైను పనుల్లో భద్రాచలం రోడ్-చంద్రగొండు వరకు కొంతకాలం క్రితమే పూర్తయ్యాయి. మిగిలిన 29 కి.మీ. పనులు తుది దశలో ఉన్నాయి. ఇవి రెండు నెలల్లో పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మెదక్ రైల్వే టెర్మినల్ అవుతుంది. కొన్ని రైళ్లను ఇక్కడి నుంచే ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. *విజయవాడ-గూడూరు ప్రాజెక్టులో కావలి- శ్రీవెంకటేశ్వరపాలెం మధ్య 12.23 కి.మీ., కాజీపేట- బల్లార్ష ప్రాజెక్టులో బిజిగిర్ షరీఫ్-జమ్మికుంట-ఉప్పల్ మధ్య 18.33 కి.మీ. కలిపి.. 30.56 కి.మీ. మేర మూడో లైన్లు పూర్తి కానున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.