Boy Amazing Drums Play: 'పిట్ట కొంచెం- కూత ఘనం' అన్న మాటకు ఆ చిన్నారి అక్షరాలా సరిపోతాడు. స్టిక్ పట్టాడంటే ఏ వేదికైనా చప్పట్ల మోత మోగాల్సిందే. వాయించడం మొదలెట్టాడంటే వారెవ్వా అనాల్సిందే. పట్టుమని పదేళ్లు కూడా రాకుండానే ప్రదర్శనలిస్తూ ఆహా అనిపిస్తున్నాడు. డ్రమ్స్ వాయించడంలో మంచి ప్రావీణ్యం సంపాదించుకున్న విజయవాడ చిన్నారిపై కథనం.
చూశారుగా ఈ చిన్నోడి ప్రతిభ. ఏడేళ్ల వయసులోనే డ్రమ్మర్‌గా సత్తా చాటుతున్నాడు. తన తండ్రిని చూసి మూడేళ్ల వయస్సు నుంచే సాధన ప్రారంభించిన చెర్రీ స్వరూప్, విజయవాడ నగరంలోని ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. డ్రమ్స్ వాయించడంపై చెర్రీకి ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి పరమేశ్.. ఖాళీ సమయంలో సలహాలు, సూచనలతో శిక్షణ ఇచ్చేవారు. తనతో పాటు ప్రదర్శనలకు తీసుకెళ్లి మరింత రాటుదేలేలా చేశారు. దీంతో చెర్రీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. చిన్న వయసులోనే వివిధ నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చేస్థాయికి ఎదిగాడు.
ఏ వేదిక మీద ప్రదర్శన ఇచ్చినా... ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేలా చెర్రీ పనితనం చూపిస్తాడు. అందుకే అవకాశాలు చెర్రీ తలుపు తడుతున్నాయి. చెర్రీలోని ప్రతిభను గుర్తిస్తూ వివిధ సంస్థలు బాలరత్న, బాల ప్రతిభ, వండర్ కిడ్ వంటి పురస్కారాలతో సత్కరించాయి. తండ్రే గురువు కావడం చాలా సంతోషంగా ఉందంటున్న చెర్రీ, రానున్న రోజుల్లో మరిన్ని ప్రదర్శనలు ఇస్తానంటున్నాడు. ఎలాంటి పాటలకైనా డ్రమ్స్ వాయిస్తానంటున్నాడు చెర్రీ స్వరూప్.