రాష్ట్రంలో 11 జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో వరంగల్ గ్రామీణ, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో కేసులు నమోదైనా కూడా వారందరూ కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పుడు ఈ 8 జిల్లాల్లోనూ ఒక్కరు కూడా పాజిటివ్‌తో చికిత్స పొందడం లేదు.
అయితే బుధవారం రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. ఫలింతగా వైరస్ బాధితుల సంఖ్య 1016కు పెరిగింది. ఆసుపత్రుల నుంచి మరో 35 మంది కోలుకొని ఇళ్లకెళ్లారు. కరోనా సమాచారం కోసం 104కు, మానసిక ఆరోగ్య సమాచారం, కౌన్సెలింగ్ కోసం 108 నంబరుకు ఫోన్ చేయాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు.
ఐసీయూలో 10 మంది
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 10 మంది ఐసీయూలో ఉన్నారు. వీరిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా.. మిగిలినవారు ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఇద్దరికి డయాలసిస్ సేవలందిస్తుండగా, మరొకరు నోటి క్యాన్సర్‌తో, ఇంకొకరు లింఫోమా, ఒకరు క్లోమగ్రంథిÅ క్యాన్సర్‌తో, నలుగురు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.