7 Mega Textile Parks Under PM Mitra: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తలపెట్టిన ఏడు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరెల్ (పీఎంమిత్ర) పార్కుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా తమిళనాడు, పంజాబ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆసక్తి ప్రదర్శించినట్లు కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి దర్శనా జర్దోష్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. రూ.4,445 కోట్ల బడ్జెట్‌తో 2027-28 నాటికి ఈ పార్కుల ఏర్పాటుచేయాలన్నది కేంద్రం లక్ష్యమన్నారు. ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో ఎక్కడ వీటిని ఏర్పాటుచేయాలన్న విషయాన్ని ‘ఛాలెంజ్ మోడ్’ ప్రాతిపదికన ఖరారుచేయనున్నట్లు పేర్కొన్నారు.
హైస్పీడ్ రైల్ కారిడార్ మార్గం మార్పునకు వినతి
హైదరాబాద్-ముంబయి హైస్పీడ్ రైల్ కారిడార్ మార్గంలో మార్పులుచేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. దీన్ని తొలుత పుణె, సోలాపుర్ మీదుగా నిర్మించాలనుకున్నామని, మహారాష్ట్ర ప్రభుత్వం జాల్నా, నాందేడ్ మీదుగా నిర్మించాలని కోరుతోందన్నారు. దీనివల్ల దూరం పెరిగి, నిర్మాణ ఖర్చు, ప్రయాణ సమయం భారీగా పెరుగుతుందన్నారు. పుణె-ఔరంగాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనేమీ లేదన్నారు.