నిబంధనలు పాటించని నారాయణ, శ్రీచైతన్య కళాశాల మూసివేత - రాష్ట్రంలో 68 ఇంటర్ కళశాలలు మూసివేత
18:49 April 17
నిబంధనలు పాటించని నారాయణ, శ్రీచైతన్య కళాశాల మూసివేత
గుర్తింపు లేని జూనియర్ కళాశాలలపై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ బోర్డు కొరడా ఝుళిపించింది. నారాయణ, శ్రీచైతన్యతోపాటు 68 కళాశాలలను మూసివేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. అగ్నిమాపక శాఖ అనుమతి లేక పోవడం వల్ల పలు నిబంధనలను బేఖాతరు చేస్తూ నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు జూనియర్ కాలేజీలు నిర్వహిస్తున్నాయంటూ సామాజిక కార్యకర్త రాజేశ్ గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిల ధర్మాసనం పలుమార్లు విచారణ చేపట్టింది. నారాయణ, శ్రీచైతన్యతోపాటు అనుమతి లేని కాలేజీలు 68 ఉన్నాయన్నారు.
అయితే పరీక్షలు ఉన్నందున ఇప్పటికిప్పుడు మూసివేయలేమని ఫిబ్రవరిలో హైకోర్టుకు ఇంటర్ బోర్డు నివేదించింది. పరీక్షలు పూర్తైన తర్వాత మూసివేసేందుకు అనుమతివ్వాలని కోరగా హైకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నారాయణ కాలేజీలు 26, శ్రీచైతన్య 18 తోపాటు మొత్తం 68 కాలేజీలు మూసివేస్తూ ప్రకటనలు జారీ చేసినట్లు జలీల్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా మూసివేత నోటీసులను ఆయా కాలేజీలకు మార్చి 24న ఈమెయిల్ ద్వారా పంపించామన్నారు. అనుమతి లేని భవనాల్లో ఎట్టిపరిస్థితుల్లో కళాశాలలు నిర్వహించవద్దని స్పష్టం చేశారు. మొదటి సంవత్సరం పూర్తైన విద్యార్థులకు మరో చోట ప్రవేశాలు కల్పించాలని యాజమాన్యాలకు తెలిపారు.
ఇదీ చూడండి:విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి