రాష్ట్ర రాజధానికి విడతల వారీగా గత నెల 29 నుంచి వచ్చిన 64 మంది విదేశీయుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరితో పాటు మార్గనిర్దేశం చేసేందుకు మధ్యప్రదేశ్ యువకుడు, ఉత్తర్ప్రదేశ్ యువకుడు తోడుగా వచ్చారు. వీరంతా ఈనెల 1న హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల్లోని మసీదులకు వెళ్లి అక్కడ ఆధ్యాత్మిక సభల్లో పాల్గొన్నారు. కరీంనగర్లో పర్యటించిన ఇండోనేషియా దేశస్థులకు కరోనా వైరస్ ఉన్నట్లే... వీరికి ఉందేమోనన్న భావనతో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఇందులో ఒకరిని ఛాతీ ఆసుపత్రికి, 13 మందిని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్లోని ఒక మతసంస్థ ఆహ్వానం మేరకు విదేశీయులు మన రాష్ట్రానికి వచ్చారు.
వివరాలిలా...
కజకిస్తాన్ | 19 మంది |
థాయిలాండ్ | 8 మంది |
మలేసియా | 13 మంది |
ఇరాన్ | 14 మంది |
వారిలో ఒక్కరికి కరోనా లక్షణాలు
విదేశీయులు వారి వారి దేశాల నుంచి బయలుదేరి గత నెల దిల్లీకి చేరుకున్నారు. గత నెల 29 నుంచి ఈనెల 12 వరకు విడతల వారీగా విమానాలు, రైళ్లలో హైదరాబాద్ చేరుకున్నారు. ఒక బృందానికి యూపీ, ఎంపీ యువకులు గైడ్లుగా, మరో బృందానికి అసోం, పాండిచ్చేరికి చెందిన యువకులు గైడ్లుగా వ్యవహరించారు. అందరూ హైదరాబాద్కు చేరుకున్నాక బృందాలుగా విడిపోయి... నగరంలోని మసీదులు, ముస్లింలకు చెందిన ఇళ్లలో ఆశ్రయం పొందారు. ఇక్కడకు వచ్చిన వారిలో ఒకరికి మినహా కరోనా అనుమానిత లక్షణాలు కనిపించలేదని పోలీసు అధికారులు తెలిపారు.