తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 6,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు - telangana latest news today

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. లాక్​డౌన్​ నేపథ్యంలో ఆగిన కొనుగోళ్లను వచ్చే వారం నుంచి మళ్లీ ప్రారంభించనున్నారు. ఆ మేరకు 6,500 కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధమైంది.

6,500 grain buying centers in the telangana state
రాష్ట్రంలో 6,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

By

Published : Apr 5, 2020, 6:19 AM IST

తెలంగాణలో 6,500 రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేవారం నుంచి వీటిద్వారా ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 1.05 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కరోనా వైరస్‌ తీవ్రతను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు.

నిజామాబాద్‌లో అత్యధికం

ఆ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల వివరాలను పౌరసరఫరాల శాఖ సేకరించింది. నిజామాబాద్‌లో అత్యధికంగా 540 కొనుగోలు కేంద్రాలు, జగిత్యాల 500, నల్గొండ 415, సిద్దిపేట 330, కరీంనగర్‌ 320, కామారెడ్డి 310, పెద్దపల్లి 300, మంచిర్యాల 250, వనపర్తి 240, కొత్తగూడెం 220, భూపాలపల్లిలో 220 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మిగిలిన జిల్లాల్లో 100 నుంచి 150 వరకు కేంద్రాలు తెరవనున్నారు. వరి పండించిన రైతులకు గ్రామాల వారీగా కూపన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లు, వాటిని మిల్లులకు తరలించే బాధ్యతలను పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం అప్పగించింది.

కొనుగోళ్లకు మరో రూ.25 వేల కోట్ల రుణం

ధాన్యం కొనుగోళ్లకు మరో రూ.25 వేల కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20 వేల కోట్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గతంలో అనుమతిచ్చింది. దిగుబడి పెరగనున్న దృష్ట్యా మరిన్ని నిధులు అవసరమని పౌరసరఫరాల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. అందుచే రూ.45 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం పూచీకత్తు ఉండేందుకు ఆమోదించింది.

ప్రతి గింజా కొనేందుకు చర్యలు: మంత్రి నిరంజన్‌రెడ్డి

రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అవసరమైనన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. శనివారం వనపర్తి సమీపంలోని రాజపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొందరు రైతులకు పాసుపుస్తకాలు రాలేదని, వారి బ్యాంకు ఖాతాల వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి సిబ్బందికి చెప్పారు.

ఇదీ చూడండి :నేటి రాత్రి లైట్లు మాత్రమే ఆపాలి: సీఎండీ

ABOUT THE AUTHOR

...view details