Special Buses for Sankranthi: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ 6400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. జనవరి 6 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించామన్న ఎండీ.. ఒకేసారి రానుపోను టికెట్లు బుకింగ్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే గతేడాది నవంబర్ నాటికి ఆర్టీసీకి రూ.2,623 కోట్లు ఆదాయం వచ్చిందని.. ఈ ఏడాది నవంబర్ పూర్తయ్యే సరికి సంస్థకు రూ.3,866 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆర్టీసీ సంస్థలోకి 62 స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టామని.. వచ్చే మార్చి నాటికి కార్గో ద్వారా రూ.165 కోట్లు ఆదాయం తేవడమే లక్ష్యమన్నారు.
మరోవైపు అన్ని బస్సుల్లో ఈ నెలాఖరు వరకు యూటీఎస్ టిమ్ మిషన్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే ఆర్టీసీలో ఇప్పటి వరకు 191 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చామని, మిగిలిన వారికీ క్రమంగా కారుణ్య నియామకాలు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనే లేదని ఎండీ స్పష్టం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం లేదని వివరించారు.