తెలంగాణ

telangana

ETV Bharat / state

KOTI WOMENS COLLEGE: తెలిసిన వాళ్లయితే చాలు.. అక్కడ ఉద్యోగమిచ్చేస్తారు..

ప్రభుత్వ అనుమతి లేదు. విశ్వవిద్యాలయంతో పట్టింపులేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 61 మందిని నిబంధనలకు విరుద్ధంగా కోఠి మహిళా కళాశాలలో నియమించేశారు. సర్కారు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ స్వయంగా ఆచార్యులు(ప్రిన్సిపల్‌) ఈ అక్రమాలకు తెరలేపడం గమనార్హం. ఈ వ్యవహారంపై వివాదం రేగగా, ‘ఈటీవీ భారత్’ చేపట్టిన పరిశోధనలో పలు కీలకాంశాలు వెలుగు చూశాయి.

61-members-were-recruited-in-koti-womens-college-against-the-rules
తెలిసిన వాళ్లయితే చాలు.. అక్కడ ఉద్యోగమిచ్చేస్తారు..

By

Published : Aug 9, 2021, 9:36 AM IST

విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది సహా ఇతర నియామకాలపై 2014లో ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సైతం పలు సందర్భాల్లో ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఉస్మానియా వర్సిటీ మహిళా కళాశాలలో మాజీ ప్రిన్సిపల్‌ రోజారాణి హయాంలో పదుల సంఖ్యలో బోధనేతర సిబ్బందిని నియమించారు. 2018 జూన్‌ 2వ తేదీ నుంచి ఆమె ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. అదే ఏడాది జులై 2న నలుగుర్ని ఒప్పంద ఉద్యోగులుగా తీసుకోవడం ద్వారా ఈ అక్రమ నియామకాల పరంపరకు తెరలేపారు.

పర్యవేక్షణ కొరవడి...

కొన్నేళ్లుగా కోఠి మహిళా కళాశాలపై యూనివర్సిటీ పర్యవేక్షణ కొరవడి కొందరు అధికారులదీ ఆడింది ఆట.. పాడింది పాటగా మారిందన్న విమర్శలున్నాయి. ఏకంగా వర్సిటీ అధికారుల అండదండలతోనే నియామకాలు జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని ఇతర అంశాల్లోనూ కళాశాలలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థికి కనీసం 70 శాతం మేర హాజరు ఉండాలి. కొందరికి వివిధ కారణాలతో హాజరు శాతం ఉండదు. ఇలాంటి వారి నుంచి కండోనేషన్‌ ఫీజు వసూలు చేసి పరీక్షలకు అనుమతించే వీలుంది. దీన్ని కొందరు అధికారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఈ ఫీజు వసూలు చేసినందుకు రెమ్యునరేషన్‌ వసూలు చేశారు. పరీక్షల విభాగంలో ఏటా ఆడిటింగ్‌ చేయాల్సి ఉండగా కొన్నేళ్లుగా జరిగిన దాఖలాల్లేవు.

ఉద్యోగాల పరంపర ఇలా..

  • దాదాపు మూడున్నరేళ్లలో ఏకంగా 61 మందిని తీసుకున్నారు. వీరికి నెలకు రూ.8 వేల నుంచి రూ.19 వేల వరకు వేతనాలు చెల్లిస్తూ వచ్చారు.
  • గతేడాది మార్చి 23 నుంచి మే 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. విద్యాసంస్థలు ఆగస్టు వరకు తెరుచుకోలేదు. అప్పట్లో జూన్‌ 1న ఒకర్ని నియమించడం గమనార్హం.
  • వర్సిటీలో గతంలో కీలక స్థానంలో పనిచేసిన ఓ అధికారి సమీప బంధువు, కళాశాలలోని ఓ ఉద్యోగి, అధికారి కుటుంబీకులను సైతం ఇదే విధంగా నియమించారు. మాజీ ప్రిన్సిపల్‌కు వరుసకు బంధువులయ్యే ఐదుగుర్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
  • అక్రమంగా నియమించిన ఓ వ్యక్తికి ఏడాదిలో నాలుగుసార్లు వేతనాన్ని పెంచారు. ఇలా నియమితులైన వారికి కళాశాల నుంచి ప్రతి నెలా రూ.6.63 లక్షలు చెల్లిస్తున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

కోఠి మహిళా కళాశాలలో జరిగిన అక్రమ నియామకాలపై మా దృష్టికి ప్రాథమిక సమాచారం వచ్చింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. - ప్రొ.డి.రవీందర్‌, ఉపకులపతి, ఓయూ.

నియామక ఆర్డర్లు ఇవ్వలేదు

ళాశాలలో బోధనేతర సిబ్బంది అవసరం దృష్ట్యా ఒకరిద్దర్ని తీసుకున్నప్పటికీ నియామక ఆర్డర్లు ఇవ్వలేదు. వారికి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ నిధి నుంచే జీతాలిస్తున్నాం. ప్రస్తుతం అవసరం లేదనుకుంటే తొలగించొచ్ఛు నియామకాల్లో నా బంధువులెవరూ లేరు. ఎవరైనా అలా చెప్పుకొంటూ ఉండొచ్ఛు. - ప్రొ.ఎ.రోజారాణి, మాజీ ప్రిన్సిపల్‌, కోఠి మహిళా కళాశాల.

ఇదీ చూడండి:Drunken Driving: 'ఒక్క ఫోన్ చేస్తే మీ బతుకులు బజారున పడతాయి'

ABOUT THE AUTHOR

...view details