రాష్ట్రంలో మొత్తం 189 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటికి ప్రభుత్వం మంజూరు చేసిన 1,861 పోస్టుల్లో ఎప్పటి నుంచో 1,125 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 189 మార్కెట్లలో ఏడాది పొడవునా పంటల క్రయవిక్రయాలు జరిగేవి 30లోపే ఉన్నాయి. కొన్నిచోట్ల పంటలే రావడం లేదు. ఉదాహరణకు సూర్యాపేట జిల్లా నకిరేకల్ మార్కెట్‌కు వసతులున్నా పంటలు పెద్దగా రావు. ఇలాంటివి 100కి పైగా ఉన్నాయి. కానీ ప్రతి మార్కెట్‌కు ప్రభుత్వం నియమించిన పాలకవర్గం ఉంది. ఈ కమిటీలో ఛైర్మన్ సహా 14 మంది డైరక్టర్లు ఉన్నారు. ఇక్కడ సిబ్బందికీ జీతభత్యాలు చెల్లించడానికి నిధులు కావాలి.
వ్యవసాయ మార్కెట్లలో 60 శాతం పోస్టులు ఖాళీ - ఉద్యోగాలు
కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలతో రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ల పనితీరుపై తీవ్ర ప్రభావం పడింది. రైతులు పంటల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు, వ్యాపారులు ఎక్కడైనా కొనుక్కోవచ్చనేది ఈ చట్టాల సారాంశం. ఈ నేపథ్యంలో చట్టాలు రాకముందు నుంచే మార్కెట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భర్తీ చేస్తుందా లేక వాటిని రద్దు చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కొత్త చట్టాలు లేనప్పుడే రాష్ట్రంలో పండిన పంటల్లో 30 శాతమే రైతులు మార్కెట్లకు తెచ్చి విక్రయించేవారు. మిగిలిన 70 శాతం పంటలను వ్యాపారులు బయటే కొని తీసుకెళ్తూ మార్కెట్ చెక్‌పోస్టుల వద్ద రుసుం చెల్లించేవారు. ఇప్పుడు మార్కెట్లకు తెస్తేనే రుసుం చెల్లించాలని, బయట కొంటే కట్టాల్సిన పనిలేదని కొత్త చట్టాలు చెబుతున్నందున... వచ్చే ఏడాది ఆదాయం భారీగా తగ్గవచ్చని మార్కెటింగ్ శాఖ అంచనా. గత అక్టోబరులో చట్టాలు రాగా ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా ఆదాయం పడిపోవడంతో మార్కెట్లలో పనిచేసే సిబ్బందికి జీతభత్యాలు చెల్లించడానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ శాఖకు ఇంతకాలం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులేమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని మార్కెటింగ్ శాఖ తాజాగా ప్రతిపాదనలు పంపింది. ఖాళీలను భర్తీ చేయాలా వద్దా అనేది చెప్పాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆ శాఖ సంచాలకురాలు లక్ష్మీబాయి తెలిపారు. వ్యవసాయ మార్కెట్లను పటిష్ఠం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ప్రభుత్వం నిర్ణయం మేరకు పోస్టుల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:నేరుగా గస్తీ బృందానికే డయల్ 100 సమాచారం