Six Crore Vaccinations in Telangana: రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌కి సంబందించి వైద్య, ఆరోగ్య శాఖ మరో మైలురాయిని అందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 6 కోట్ల టీకాలు పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 3.11 కోట్ల మందికి మొదటి డోస్, 2.83 కోట్ల మందికి రెండు డోసులు పూర్తి చేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 5.18 లక్షల మందికి బూస్టర్ డోస్ ఇవ్వగా, 12 నుంచి 14 ఏళ్ల మధ్య వారికి ఇప్పటికే 19 శాతం మందికి టీకా పంపిణీ పూర్తి అయింది. 6 కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
బూస్టర్ డోస్..
Booster Dose in India: చైనా సహా పలు దేశాల్లో మరోసారి కరోనా విజృంభణ మొదలైన నేపథ్యంలో దేశంలో 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసును అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు సహా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోసులు అందుబాటులో ఉన్నాయి.
రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకోవాలని కేంద్రం ఇదివరకు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 10న అర్హులైన వారికి బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభించింది. ఇప్పటికీ వరకు 2,05,89,099 ప్రికాషనరీ డోసులను పంపిణీ చేసింది. మరోవైపు 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని మొదలుపెట్టింది కేంద్రం. ఈనెల 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్లో ఇప్పటివరకు 34,72,201 డోసులను కేంద్రం అందించింది. దేశవ్యాప్తంగా ఆదివారం మరో 2,97,285 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,81,24,97,303కు పెరిగింది.
ఇదీ చూడండి :దేశంలో కొత్తగా 1,549 కరోనా కేసులు.. 31 మరణాలు