రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,471 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 596 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,72,719కి చేరింది. మరోవైపు కరోనాతో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,470కి చేరింది.
తాజాగా కరోనా నుంచి మరో 972 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 2,62,751 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,498 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 6,465 మంది ఉన్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 102 కేసులు నమోదయ్యాయి.
క్రమేణా తగ్గుతోంది...
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. జీహెచ్‌ఎంసీ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అర్బన్ తదితర 18 జిల్లాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా... ఆదిలాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి వంటి 10 జిల్లాల్లో స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగాయి. జోగులాంబ గద్వాల, ఆసిఫాబాద్, నారాయణపేట, మెదక్- ఈ నాలుగు జిల్లాలో పెద్దగా మార్పుల్లేవు.
పోలీస్ శాఖలో కరోనా గుబులు
తెలంగాణ పోలీస్ శాఖలో మళ్లీ కరోనా కలకలం రేగుతోంది. జీహెచ్‌ఎంసీ పోలింగ్ అనంతరం జిల్లాలకు తిరిగి వెళ్లిన సిబ్బందికి కొన్ని చోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ కేసులు బహిర్గతమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 35 మందికి పరీక్షలు చేయగా.. 14 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈక్రమంలో మరోమారు పోలీసులతోపాటు ఎన్నికల విధులకు హాజరైన ఇతర శాఖల సిబ్బందికీ పరీక్షలు నిర్వహించారు. దీంతో మరో 65 మంది కరోనా బారిన పడినట్లు తేలింది. వీరిలో 40 మంది వరకు పోలీసులున్నారు. నిర్మల్ జిల్లా నుంచి వచ్చిన 79 మంది ప్రభుత్వ శాఖల సిబ్బందికి పరీక్షలు చేయగా.. అక్కడ ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈనేపథ్యంలో మిగిలిన జిల్లాల్లోనూ ఎన్నికల విధులకు హాజరైన పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. మార్చి చివరి వారంలో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ఇదీ చూడండి:'24 గంటల్లోనే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట'