రాష్ట్రంలో కరోనా కేసులు 7 వేలు దాటాయి. శనివారం ఒక్కరోజే 546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు. ఈ నెల 6 నాటికి 3,496 కేసులు ఉండగా, శనివారం ఈ సంఖ్య 7,072కి చేరింది. కేవలం 14 రోజుల్లోనే పాజిటివ్ కేసులు రెండింతలు అయ్యాయి. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కరోనా పరీక్షలు పెరుగుతుండటంతో అదే స్థాయిలో కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. శనివారం 3,188 మంది నమూనాలు పరీక్షించారు. జీహెచ్‌ఎంసీలో కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 458 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 50 కేసులు నమోదయ్యాయి. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 200 మార్కును దాటింది. శనివారం నాటికి 203 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకుని శనివారం 154 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,506కి చేరింది. మరో 3,363 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోఠిలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో కొందరికి పాజిటివ్ రావడంతో అక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.