వారం క్రితం వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో విజృంభించిన కరోనా బాధితుల సంఖ్య గత ఐదారు రోజులుగా తగ్గుముఖం పట్టింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నగర శివారు ప్రాంతాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
తాజాగా సోమవారం గ్రేటర్ హైదరాబాద్‌లో 510 మందికి కొవిడ్-19 సోకింది. రంగారెడ్డి జిల్లాలో 106, మేడ్చల్ జిల్లాలో 76 కేసులు బయటపడ్డాయి. గాంధీతోపాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. జ్వరం, దగ్గు, నీరసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సొంతూళ్లకు
వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరోవైపు శివార్ల నుంచి పనుల నిమిత్తం నగరానికి నిత్యం వచ్చి పోయే వారు ఎక్కువ. తద్వారా వైరస్ ఆయా ప్రాంతాలకు పాకుతోంది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 66 మందికి, కూకట్‌పల్లి, మూసాపేట, బాలానగర్, ఎల్లమ్మబండ, హస్మత్‌పేట తదితర ప్రాంతాల్లో 33, శేరిలింగంపల్లి ప్రాంతంలో 46, యూసఫ్‌గూడ సర్కిల్‌లో 23, మల్లాపూర్‌లో 21, ఉప్పల్‌లో 67, కాప్రాలో 10, శామీర్‌పేటలో 15 మందిలో కరోనా నిర్ధారణ అయింది.