50 Lakh People Traveled in TSRTC Buses in One Day :తెలంగాణ సర్కార్ మహలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ (TSRTC) బస్సు ప్రయాణం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం వల్ల ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పథకం కింద మహిళలకు, బాలికలకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీని ద్వారా వారు ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
Free Bus For Women :ఈ క్రమంలోనే సోమవారం రోజున టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రికార్డు స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) మునిశేఖర్ తెలిపారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య సోమవారానికి మరో 9 లక్షలు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం, కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారని మునిశేఖర్ చెప్పారు. ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్‌తో పాటు స్పేర్ బస్సులను నడిపించగా డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు పేర్కొన్నాయి.
కిక్కిరిసిన నిర్మల్ బస్టాండ్ - సీటు కోసం డ్రైవర్ క్యాబిన్ ద్వారా బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులు
ఉచిత బస్సు ప్రయాణంపై సంతోషం వ్యక్తం చేస్తున్న మహిళలు :ఉచిత బస్సు సౌకర్యంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయాల్సి వస్తే వేలల్లో ఖర్చు అయ్యేదని, ఇప్పుడు తమకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆర్థికంగా ఉపశమనం కలిగిందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమలాంటి పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని చెబుతున్నారు. ఆడవారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.