50 కోట్లు దండుకున్న 'దొంగ బాబా' గిరీశ్ సింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటకు చెందిన ఈరగపర్తి కుమార్ గిరీశ్ సింగ్ 2002లో డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడానికి సూళ్లూరు పేటలోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ మొదలు పెట్టాడు. అందులో పెట్టుబడి పెట్టిన వారికి కుచ్చుటోపీ పెట్టాడు. అనంతరం డయాబెటిస్ మొక్కల వ్యాపారం పెట్టి.. ఆ మొక్కలు తింటే మధమేహం తగ్గిపోతుందని నమ్మించి అమాయకుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు.
మనీ సర్కులేషన్ పేరుతో గాలం...
తర్వాత మకాం హైదరాబాద్‌కు మార్చాడు. ప్రజలను ఆకర్షించి.. వారికి డ్రీమ్ బ్రిడ్జ్ మనీ సర్కులేషన్ పేరుతో ఓ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పాడు. తాను ఓ మొబైల్ యాప్‌ను తయారు చేస్తున్నానని.. అమెజాన్ లాంటి సంస్థలా పెద్ద గుర్తింపు వస్తుందని మభ్య పెట్టాడు. అందులో పెట్టుబడులు పెట్టండంటూ అమాయకులను ఆకర్షించి 40 కోట్లను దండుకున్నాడు. ఈ కేసులో జైలుకు వెళ్ళి గత జూన్‌లో విడుదల అయ్యాడు.
గిరీశ్ ఫుడ్ సర్వీస్ పేరుతో..
జైలు నుంచి విడుదలై అనంతరం గిరీశ్ ఫుడ్ సర్వీస్ పేరుతో కొంత మందిని అందులో పెట్టుబడులు పెట్టమని కోరాడు. తనకు హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయని నమ్మించి.. 10 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. దీనిపై రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
బాబాగా అవతారం..
ప్రముఖ ఛానెళ్ళలో ఆధ్యాత్మిక ప్రకటనలతో మహిళలను, సామాన్యులను ఆకర్షించాడు. అద్వైత స్పిరుచువల్ రీఛ్ర్జ్ ఫర్ ఎక్సెలెన్స్ పేరుతో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని మధురానగర్‌లో ఆధ్యాత్మికత, మోటివేషనల్ క్లాసులు ప్రారంభించాడు. అతని వద్దకు వచ్చిన ఓ మహిళ నుంచి ఏటీఎం కార్డు తీసుకుని 2.70 లక్షలు డ్రా చేసుకుని తప్పించుకు తిరిగాడు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బురిడీ బాబా గిరీశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై నాలుగు పీఎస్‌లలో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
ఇవీ చూడండి: ద్విచక్రవాహన దొంగ అరెస్ట్