Private Hospitals in Telangana: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏడాదికి 5 శాతం పడకల్లో ఉచిత వైద్యసేవలందించాలనే నిబంధన అటకెక్కింది. దీనిపై పర్యవేక్షణ కొరవడటంతో.. అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఈ నిబంధనకు తూట్లు పొడుస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సమీక్షలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. ఇకనుంచి జిల్లా వైద్యాధికారులకే దీని బాధ్యత అప్పగిస్తూ.. ఈ నిబంధన పరిపూర్ణంగా అమలయ్యేలా బాధ్యత వహించాలంటూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
రాష్ట్రంలో తొలి, రెండోదశ కొవిడ్ కాలంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు కనికరం చూపకుండా కరోనా రోగుల నుంచి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. ఒకపక్క ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ.. 5 శాతం పడకల్లో ఉచిత వైద్యం అందించాలనే నిబంధన ఉన్నా.. అత్యధిక ఆసుపత్రులు కొవిడ్ కాలంలో నిర్దయగా వ్యవహరించాయనే విమర్శలున్నాయి. కనీసం బిల్లులో 5 శాతం తగ్గించడానికి ముందుకు రాని ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మూడోదశ ఉద్ధృతి నేపథ్యంలో నిరుపేద రోగులకు ఉచిత వైద్యపథకం ద్వారా కొంత వరకైనా మేలు జరుగుతుందని వైద్యశాఖ భావిస్తోంది. 5 శాతం పడకలను ఎలా ఉచితంగా అందించాలనే విషయంపై కొంత అస్పష్టత ఉండటాన్ని.. ప్రైవేటు ఆసుపత్రులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.