తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2020, 6:25 AM IST

ETV Bharat / state

నిండా మునిగిన రైతు... 4 లక్షల మందికి నష్టం

ఎడతెరిపి లేకుడా కురిసిన వర్షాలతో రాష్ట్రంలో 4,071 పంటలు గ్రామాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. దాదాపు 4 లక్షలకు పైగా రైతులకు నష్టం వాటిల్లినట్లు ఓ అధికారి వివరించారు. దిగుబడి సగానికి సగం తగ్గిపోతుందని... దాని విలువ రూ.2 వేల కోట్ల వరకూ ఉంటుందని వెల్లడించారు.

4lakhs-farmers-losses-crops-in-telangana
నిండా మునిగిన రైతు... 4 లక్షల మందికి నష్టం

ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంట నష్టం భారీగా ఉన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక పరిశీలనలో గుర్తించింది. త్వరలో ఒక్కో కమతం వారీగా వివరాలను తయారుచేయాలని తాజాగా నిర్ణయించింది. ‘రాష్ట్రంలోని 27 జిల్లాలకు చెందిన 348 మండలాల పరిధిలోని 4,071 గ్రామాల్లో పంటలు నాశనమయ్యాయి. మొత్తం 3.53 లక్షల మంది రైతులకు చెందిన 7,35,525 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిల్లో దిగుబడి సగానికి సగం తగ్గిపోతుంది. దాని విలువ రూ.2 వేల కోట్ల వరకూ ఉంటుంది’ అని వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికను తాజాగా ప్రభుత్వానికి పంపింది. ఈ నివేదికలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 47,808, సిద్దిపేట జిల్లాలో 65,925, మహబూబాబాద్‌ జిల్లాలో 4,210 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. కానీ ఎందరు రైతులనే వివరాలను ఇవ్వలేదు.

నిండా మునిగిన రైతు... 4 లక్షల మందికి నష్టం


ఈ జిల్లాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే నష్టపోయిన రైతులు 4 లక్షలకు పైగా ఉంటారని ఓ అధికారి వివరించారు. పంట నష్టాలకు కేంద్రం నుంచి పెట్టుబడి రాయితీ కింద రైతులకు తక్షణ సాయం రావాలంటే ఒక్కో కమతం వారీగా పంట, రైతు వివరాలన్నీ సేకరించి పంపాలి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆదేశాలిచ్చిన తర్వాత రైతువారీగా వివరాలు సేకరించాలని వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అత్యధికంగా మెదక్‌లో 54,747 మంది; ఖమ్మం జిల్లాలో 53,985 మంది రైతులు పంటలు నష్టపోయారు.

నిండా మునిగిన రైతు... 4 లక్షల మందికి నష్టం


పాతవాటికి పరిహారం లేనట్టేనా?

వ్యవసాయ శాఖ తాజా పంట నష్టాలనే ప్రస్తావిస్తోంది. గత వారం రోజుల్లో కురిసిన వర్షాలకు 7.35 లక్షల ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి తెలిపింది. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు 4 లక్షల ఎకరాలకు పైగా దెబ్బతిన్నట్లు అప్పట్లోనే జిల్లా అధికారులు స్థానికంగా తెలపగా ఆ విషయాలను ప్రస్తావించలేదు. తాజా నష్టాలకు పరిమితమై వివరాలు సేకరిస్తారా, లేక పాతవాటినీ పరిగణనలోకి తీసుకుంటారా అనేదానిపై అధికారులు ఏమీ స్పష్టత ఇవ్వడం లేదు.


రంగుమారిన ధాన్యం పరిస్థితి ఏమిటో...?


ఏకధాటిగా కురిసిన వర్షాలతో రంగు మారిన ధాన్యం పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకంగా ఉంది. ఇది సుమారు రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. పొలంలో ఉన్న ధాన్యం కోసి ఆర బెట్టిన తర్వాత కానీ ఎంత మేరకు రంగు మారిందన్నది నిర్ధారణ కాదు. అలాగే 17 శాతానికి మించి తేమ ఉంటే పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయదు. ప్రభుత్వం నిబంధనలు సడలించకపోతే ఇప్పటిప్రకారం ముందుకెళ్లడం తప్ప తమ చేతుల్లో ఏమీ లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ధాన్యం దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఏ మేరకు ఆదుకుంటుందన్నది వేచిచూడాలి.

ఇదీ చదవండి:ధరణి పోర్టల్​ ప్రారంభానికి శరవేగంగా ఏర్పాట్లు.. నేడు సీఎస్​ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details