4 years child Suspicious death in Medchal : నాలుగేళ్ల పాప భోజనం చేసి పడుకుంది. కొంత సమయానికి కళ్లు తెరుస్తుందని తల్లి అనుకుంది. కానీ శాశ్వతంగా కళ్లు మూసేసిందని తెలిసి కన్నీరుమున్నీరైంది. చిన్నారిని బతికించాలని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పాప అసలు ఎందుకు మృతి చెందిందో తెలియక ఆ తల్లి మరింత శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తండ్రి కుమార్తె అనుమానాస్పద మృతిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. : మేడ్చల్ జిల్లా కుషాయిగూడకు చెందిన నాయకవాడి రమేశ్, కల్యాణిని 2018లో ప్రేమ విహహం చేసుకున్నాడు. వారికి పాప తన్విత(4) జన్మించింది. వారి మధ్య కుటుంబ కలహాల కారణంగా 2021 నుంచి కల్యాణి పాపతో సహా తన సొంత ఇంట్లో జీవిస్తోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంది. సాయంత్రం ఎంతసేపైనా నిద్రలో నుంచి లేవలేదు. దీంతో బాలిక తల్లి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. పాప మృతదేహాన్ని పోస్టుమర్టానికి తరలించారు. అయితే.. బాలిక అనుమానాస్పద మృతి పట్ల పాప తండ్రి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. పాప మధ్యాహ్నం తినే ఆహారంలో ఏమైనా విషతుల్యం అయిందా..? చిన్నారి నిద్రలో చనిపోడానికి కారణాలు ఏంటి..? ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా..? ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.