75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై రెండున్నర ఏళ్ల క్రితం ప్రధాని నిర్వహించిన సదస్సులో తాను కీలక సూచన చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 3 ఐ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్, ఇన్నోవేషన్) నినాదంతో భారత్ అభివృద్ధి సాధ్యమని ప్రధానితో చెప్పానని.. ఈ అంశంపై ఆయన కూడా ఆసక్తి కనబరిచారని చెప్పారు. 3 ఐ నినాదంలో ముఖ్యమైనది ఇన్నోవేషన్ అని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కొత్త విధానాలు తీసుకురావడం కూడా ఇన్నోవేషన్ కిందకే వస్తుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్లో అంతర్జాతీయ ఇన్నోవేషన్ ఇన్ ఇంజినీరింగ్ సదస్సు కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌టీయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతోంది. ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా కేటీఆర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జేఎన్‌టీయూలో నాకు చాలా మంది మిత్రులున్నారని గుర్తు చేసుకున్నారు.
కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన ఇన్నోవేషన్ కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తి: సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన ఇన్నోవేషన్ కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తినిచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త విధానాలు తీసుకురావడం కూడా ఇన్నోవేషన్ కిందే వస్తుందని చెప్పారు. కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు పారిశ్రామిక విధానంపై కేసీఆర్ చర్చించారని తెలిపారు. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు, ఆలోచనలు సీఎం స్వీకరించారని పేర్కొన్నారు. విద్యుత్, పరిశ్రమలకు అనుమతుల జాప్యంపై సమస్యల గురించి వారు వెల్లడించారు.
వాణిజ్య విధానాలపై బృందాన్ని పంపి అధ్యయనం చేయిస్తామని సీఎం వారికి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేద్దామని తెలిపారు. ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలతో పారిశ్రామిక విధానం తెచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కొద్ది నెలల వ్యవధిలోనే టీఎస్‌ఐపాస్ విధానం అమల్లోకి తెచ్చామన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం, మున్సిపాలిటీ అనుమతులతో సంబంధం లేకుండా ఈ విధానాన్ని రూపొందించామని అన్నారు.