ఆదివారం జరిగిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని బోనాల విశిష్టతను చాటిచెప్పేలా సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన త్రీడీ మ్యాపింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంజలి థియేటర్ సమీపంలోని చిత్రదర్గాతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద త్రీడీ మ్యాపింగ్ నిర్వహించారు. స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పండుగలు, ఇతరత్రా ఉత్సవాల సమయంలో త్రీడీ మ్యాపింగ్ కొనసాగించనున్నారు.
తెలంగాణలో ప్రధానంగా జరపుకునే పండుగల్లో బోనాలు ఒకటి. ఈ బోనాల పండుగ సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. బోనాల్లో పోతురాజుల విన్యాసం, ఘటాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల వేడుకల్లో పలు కార్యక్రమాలు ఉంటాయి. ఘటోత్సవంతో ప్రారంభమైన వేడుక.. రంగం తర్వాత ఊరేగింపుతో ముగుస్తుంది.
కొవిడ్ నిబంధనల నడుమ ఆదివారం లష్కర్ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం అమ్మవారికి తొలిబోనాన్ని సమర్పించింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
శివసత్తులు పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలంతా ఉదయాన్నే పట్టుచీరలు కట్టుకుని ముత్తైదువుల్లా అలంకరించుకుని బోనమెత్తి అమ్మవారి ఆశీర్వాదం కోసం తరలివచ్చారు. పిల్లాపెద్దలతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.