ప్రస్తుతం నడుస్తున్నది వానాకాలమైనా.. అనూహ్యమైన వేడి.. మండు వేసవి మాదిరిగా ఉక్కపోతలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శనివారం ఆదిలాబాద్ జిల్లా అర్లి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 39 డిగ్రీలు, ఆదిలాబాద్ పట్టణంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత పదేళ్ల సెప్టెంబరు నెల చరిత్రలో ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి అని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో 2015 సెప్టెంబరు 11న అత్యధిక ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు నమోదైనట్లు రికార్డు ఉంది. ఇప్పుడు దాని కంటే 3.2 డిగ్రీలు పెరిగింది.
కిషన్‌బాగ్‌లో రాత్రిపూటే 27.5 డిగ్రీలుశుక్రవారం రాత్రి రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో 27.5 డిగ్రీలు, ఎల్‌బీ స్టేడియం వద్ద 25.6, భద్రాచలంలో 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సెప్టెంబరు నెలలో రాత్రిపూట సాధారణ ఉష్ణోగ్రత 22.3 డిగ్రీలుంటుంది. ఇప్పుడు 3 డిగ్రీలకు పైగా పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలు పెరగడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వివరించారు.
ఎందుకిలా...?రుతుపవనాలు హిమాలయాల వైపు వెళ్లిపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఉపరితల ద్రోణి గానీ, ఆవర్తనం గానీ లేకపోవడంతో వేడిమి పెరిగిపోతోంది. ఆది, సోమ, మంగళవారాల్లో కొంత మార్పు వస్తుందని, అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని నాగరత్న చెప్పారు. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి.
అత్యధికంగా జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)లో 2.6 సెం.మీ., ఆసిఫాబాద్‌లో 2.3 సెం.మీ. వర్షం కురిసింది.