Vijayawada Book Festival: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతోన్న 32వ పుస్తక మహోత్సవానికి విశేష స్పందన లభిస్తోంది. 200 పైగా పుస్తక ప్రచురణ సంస్థలు, బుక్‌హౌస్‌లు… స్టాళ్లు ఏర్పాటు చేసి పలు రకాల పుస్తకాలను విక్రయిస్తున్నాయి. విజ్ఞానం, వినోదాన్ని పెంచే పుస్తకాలు, సాహిత్యాభిరుచిని పెంపొందించే పలు పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ప్రముఖ కవులు, సాహితీ వేత్తలు రచించిన ప్రసిద్ద గ్రంథాలు, నవలలు విక్రయిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనను పెంచే గ్రంథాలు లభ్యమవుతున్నాయి.
పుస్తక విక్రయాలు పెరిగాయి..
పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థుల కోసం నిపుణులు రూపొందించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు చదువుపై ఆసక్తిని పెంచే పాఠ్య పుస్తకాలు సహా కథలు కార్టూన్ల పుస్తకాల పట్ల ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. పిల్లలకు చిత్రలేఖనం పట్ల ఆసక్తి పెంచే పలు రకాల అంశాలను ప్రదర్శిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో సహా ప్రదర్శనశాలకు వచ్చి నచ్చిన వాటిని కొనుక్కుంటున్నారు. రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన పెంచేలా ఆసక్తి పెంచేలా రూపొందిన నువ్వు నేను రాజ్యాగం పుస్తకాలు, కోర్టులు, చట్టాలపై అవగాహన పెంచే పలు పుస్తకాల కొనుగోలుకు పలువురు ఆసక్తి కనపరుస్తున్నారు. మంచి సందేశాలను కార్టూన్ల రూపంలో తయారు చేసి పలువురు కార్టునిస్టులు పుస్తకాలను అందుబాటలోకి తెచ్చారు. ఈసారి పుస్తక విక్రయాలు బాగా జరుగుతున్నాయని, పాఠకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని విక్రేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.