లాక్‌డౌన్ సడలింపుతో ఇంటింటికి తిరిగి విద్యుత్తు బిల్లుల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జూన్‌లో ఒకేసారి రీడింగ్ నమోదు చేయనున్నారు. కంటెయిన్‌మెంట్ మినహా అన్ని ప్రాంతాల్లో మీటర్ రీడింగ్ తీస్తారు. మూడు నెలలకు ఒకేసారి రీడింగ్ తీస్తుండటంతో ఏ విధంగా బిల్లు ఇవ్వాలనే విషయమై ఇప్పటికే డిస్కం ఓ నిర్ణయానికి వచ్చింది. ఆమేరకు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. వినియోగదారులకు భారం కాకుండా, డిస్కం నష్టపోకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.
లాక్‌డౌన్‌తో వాయిదా..
విద్యుత్తు వినియోగానికి సంబంధించి సాధారణంగా ప్రతి నెలా బిల్లులు జారీ చేస్తుంటారు. మార్చి వినియోగానికి సంబంధించి ఏప్రిల్ ఒకటి నుంచి రీడింగ్ నమోదు ప్రారంభించి పదో తేదీ వరకు పూర్తి చేయాలి. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన బిల్లులను ఈ సంవత్సరం కట్టించుకుంది. ఒక రకంగా ఇది ముందస్తు చెల్లింపులాంటిది. మార్చి, ఏప్రిల్, మే నెలల వాస్తవ వినియోగానికి సంబంధించి ఈ నెలలో రీడింగ్ నమోదు చేస్తారు. ఈ నెలలో ఇచ్చే బిల్లులో ఏప్రిల్, మేలో చెల్లించిన మొత్తాన్ని తీసేసి మిగిలిన బిల్లు ఇస్తారు.