ఎక్సైజ్ శాఖలో 280 సబ్ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. గ్రూపు-2 కింద 267 మంది ఎక్సైజ్ ఎస్ఐలుగా ఎంపిక కాగా... వారికి గతేడాది జనవరిలో శిక్షణ మొదలైంది. ఇంతలో కొవిడ్ మొదటి దశ విజృంభణతో 6 నెలల శిక్షణా తరగతులను రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకు కుదించింది. ఈ సమయంలో కొవిడ్ ఉద్ధృతి మరింత పెరగడం వల్ల 45రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని కూడా నిలిపేశారు. అయితే నిబంధనల ప్రకారం మరో 45రోజులు శిక్షణ పూర్తి చేస్తేకాని వారికి డ్యూటీ కేటాయించడం కుదరదు.
శిక్షణ పూర్తికాకుండానే విధుల్లోకి
కొవిడ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నూతనంగా ఎంపికైన వారికి శిక్షణ పూర్తి కాకుండానే ఎక్సైజ్‌శాఖ పోస్టింగ్ ఇచ్చింది. వీరు నియమితులయ్యే సమయానికి పలువురు సీనియర్ అసిస్టెంట్లకు, హెడ్‌కానిస్టేబుళ్లకు సబ్ ఇన్‌స్పెక్టర్లుగా తాత్కాలిక పదోన్నతులు కల్పించింది. దీనితో 267 మందిలో 87 మందికి మినహా మిగిలిన వారికి ఎక్సైజ్‌శాఖ పోస్టింగ్‌లు ఇచ్చింది. ఇక్కడో చిక్కొచ్చి పడింది. పోస్టింగ్‌లు ఇవ్వని వారికి జీతాలు చెల్లించడం కష్టమవుతుందని భావించిన సర్కారు... 2020 జనవరిలో సంవత్సర కాలం గడువుతో 87 సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించింది. ఈ ఏడాది కాలంలో కొంతమంది ఎస్సైలు పదవీ విరమణ పొందడంతో కొందరికి పోస్టింగ్‌లు వచ్చాయి. ఏడాది గడువు ముగిసినా పోస్టింగ్‌లు లేక 73మంది మిగిలారు. వీరికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం వల్ల జీతాలు అందడం లేదు. మరో వైపు వీరందరిని వివిధ ఎక్సైజ్ స్టేషన్లకు అటాచ్ చేసి విధులు నిర్వర్తించుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ జీతాలు రాక.. కుటుంబ పోషణ భారమై.. అధికారులు చెప్పినట్లు చేయకపోతే ఉద్యోగాలు పోతాయనే భయంతోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉద్యోగం ఉన్నా... హోదా లేదు