అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్)కు దరఖాస్తు చేసుకున్న లక్షల మంది.. ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పది లక్షల మందికి పైగా, పట్టణ ప్రాంతాల్లో మరో పది లక్షల మంది.. నగర పాలక సంస్థల పరిధిలో నాలుగు లక్షల మందికిపైగా దరఖాస్తుదారులు ఉన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కానిదే ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు, క్రయ విక్రయాలకు అవకాశం లేదు. అవసరాలకు ప్లాట్లను అమ్ముకోలేరు. ఇళ్లను నిర్మించుకునేందుకు భవననిర్మాణ అనుమతులు రావు.
నెలన్నర కావొస్తున్నా...
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లక్ష్యంగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 25.59 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది ముగిసి నెలన్నర కావస్తున్నా వీటి పరిష్కార ప్రక్రియ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దరఖాస్తు చేసుకున్నవారిలో అత్యధికులు మధ్యతరగతి వారే ఉన్నారని ప్రాథమిక అంచనా. పట్టణీకరణ నేపథ్యంలో నగరాల్లోనే కాకుండా పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేల సంఖ్యలో లేఅవుట్‌లు వచ్చాయి. క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుందనే విశ్వాసంతో లక్షల మంది ఎల్‌ఆర్‌ఎస్ లేకున్నా ప్లాట్లను కొనుగోలు చేశారు.