తెలంగాణలోని పురపాలికల్లో ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో ప్రజలకు పౌర సేవలను మరింతగా వేగంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, క్యాబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీపైన ఆరుసార్లు అంతర్గతంగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన అనంతరం.. తుది నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖ 2,298 కొత్త ఖాళీలను భర్తీ చేసే ముందు సంబంధిత పోస్టులను, ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేయాలన్న.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పురపాలకశాఖ అంతర్గతంగా చర్చలు నిర్వహించి ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగాల భర్తీ
పరిశుభ్రమైన, ప్రణాళిక బద్దమైన విధంగా ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలని ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రజలకు వేగంగా పౌర సేవలు అందించడంతోపాటు పట్టణ ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. దీంతో పురపాలనలో నూతన మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు ఒక పురపాలక ఉద్యోగిని ఉంచే లక్ష్యంతో వార్డు అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. ఇలా అన్ని వార్డుల్లో ఒక అధికారి ఉండడం దేశంలోనే మెదటిసారిని మంత్రి అన్నారు. పురపాలక చట్టం నిర్ధేశించిన పారిశుద్ధ్యం, హారిత హారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పురసేవల అమలు మెదలైన కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఈ వార్డు అధికారుల నియామకం దోహాదం చేస్తుందన్నారు.