గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. గురువారం మరో 22 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1038కి పెరిగింది. ఈ మహమ్మారికి రాష్ట్రంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం వల్ల మృతుల సంఖ్య 28కి చేరింది. గురువారం 33 మంది కోలుకొని గాంధీ నుంచి ఇళ్లకెళ్లారు. ఇందులో 50 ఏళ్ల వయసున్న వైద్యుడు కూడా ఉన్నారు.
తాజాగా నమోదైన అన్ని కేసులు కూడా హైదరాబాద్(జీహెచ్‌ఎంసీ) పరిధిలోనివే కావడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా రాజధానిలోనే బాధితులు పెరుగుతున్నారు. తాజా కేసుల్లో మార్కెట్లో పనిచేస్తున్న వారి ద్వారా పలువురికి వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. మలక్‌పేటగంజ్‌లో పనిచేస్తున్న పహాడీషరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల ద్వారా మార్కెట్లో మరో మూడు షాపుల యజమానులకు ఈ వైరస్ సోకింది. తద్వారా వారి కుటుంబ సభ్యులకూ కొవిడ్ వ్యాప్తి చెందడం వల్ల వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. మలక్‌పేటగంజ్, పహాడీషరీఫ్‌లను కంటైన్మెంటు ప్రాంతాలుగా ప్రకటించారు.
అప్రమత్తమైన ప్రభుత్వం..
ఒక్కసారిగా వైరస్ కేసుల సంఖ్య పెరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి, హైదరాబాద్ పరిధిలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తదితర ఉన్నతాధికారులతో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కరోనా చికిత్స, రోగులకు అందిస్తోన్న సౌకర్యాల పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ‘గాంధీ’ సహా ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం సమగ్ర నివేదికను ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
మృతులకు దీర్ఘకాల సమస్యలు
తాజాగా వెల్లడించిన ముగ్గురు మృతులూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది.
1. రామాంతపూర్‌కు చెందిన 48 ఏళ్ల పురుషుడు మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, నిమోనియా సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా సోకినట్లుగా గుర్తించిన ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్చగా.. చేరిన 12 గంటల్లోనే మృతిచెందారు.