Padma Awards 2023: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించగా.. వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గతేడాది మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లు స్వీకరించిన కేంద్రం.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది.
రాష్ట్రం నుంచి మొత్తం ఐదుగురు పద్మ పురస్కారాలను అందుకోగా.. వీరిలో ఇద్దరిని పద్మభూషణ్, ముగ్గురిని పద్మశ్రీ వరించింది. చినజీయర్ స్వామి, కమలేశ్ డి.పటేల్‌కు పద్మభూషణ్ పురస్కారం లభించగా.. బి.రామకృష్ణారెడ్డి, ఎం.విజయగుప్తా, పసుపులేటి హనుమంతరావులను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు సంతోషం వ్యక్తం చేశారు.
చినజీయర్ స్వామికి తగిన గుర్తింపు..ప్రముఖ ఆధ్యాత్మిక గురువు... సమతామూర్తి విగ్రహ రూపశిల్పి చినజీయర్‌స్వామికి కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు. 1980లో త్రిదండి సన్యాసిగా దీక్షను స్వీకరించిన అనంతరం త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ అయ్యారు. చినజీయర్ స్వామి 1981లో నడిగడ్డపాలెంలోని శ్రీమద్‌ఉభయ వేదాంత ఆచార్య పీఠానికి అధిపతి అయ్యారు. జీయర్‌స్వామి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విద్యనందించేందుకు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, వికాస తరంగిణిలను ఏర్పాటు చేశారు. విజయవాడ కేంద్రంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం శంషాబాద్‌లో శ్రీరామనగర్‌లో జీవాశ్రమం పేరుతో ఆశ్రమాన్ని నిర్మించారు. దివ్య సాకేతం పేరుతో ఆలయాన్ని ప్రారంభించారు.
ధ్యాన గురువు దాజీకీ ఉన్నత పురస్కారం..ప్రపంచవ్యాప్తంగా హార్ట్‌పుల్‌నెస్ మేడిటేషన్ గైడ్‌గా, హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్, హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా, సహజ్ మార్గ్ స్పిరిచ్యువాలిటీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ప్రఖ్యాత ధ్యాన గురువు, శ్రీరామ్‌చంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్‌కు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దాజీ(పెద్దన్న) అని పిలుచుకునే కమలేష్ డి పటేల్ గుజరాత్‌లో 1956లో జన్మించారు. ఫార్మసీ విద్యార్థిగా ఉన్న సమయంలోనే రాజయోగ ధ్యానం మొదలెట్టారు. గురువు రామ్‌చంద్ర (బాపూజీ) దగ్గర 1976 నుంచి సాధన ఆరంభించారు. అహ్మదాబాద్‌లో ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ చేశాక న్యూయార్క్ పీజీ చేసి అక్కడే ఫార్మా వ్యాపారం ప్రారంభించారు. భార్య, ఇద్దరు పిల్లలతో కొంతకాలం అక్కడే ఉన్నారు. 1983లో రామ్‌చంద్ర మరణంతో అధ్యక్షుడిగా పార్థసారథి రాజగోపాలాచారి(చారిజీ) బాధ్యతలు చేపట్టారు. ఆయనతో కలిసి 2003 నుంచి శ్రీరామ్‌చంద్ర మిషన్ కార్యకలాపాల్లో భాగస్వామి అయ్యారు. 2014 నుంచి శ్రీరామ్‌చంద్ర మిషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. భారత్‌తో పాటు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆయన ఆధ్యాత్మిక కార్యశాలలు నిర్వహించారు. ఆయన రాసిన ది హార్ట్‌ఫుల్‌నెస్ వే పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో చెగూరులో 1400 ఎకరాల్లో శ్రీరామ్‌చంద్ర మిషన్ (కన్హా శాంతివనం) విస్తరించి ఉంది.
గిరిజన భాషలకూ గుర్తింపు..: గిరిజన భాషలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేయాలంటున్నారు ఆచార్య బి.రామకృష్ణారెడ్డి. కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన ఆయన వయసు 80 సంవత్సరాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గానూ వ్యవహరించారు. గిరిజన భాషలైన కువి, మండలపై విస్తృత పరిశోధన చేశారు. గిరిజన భాషలను కూడా అధికార భాషలుగా గుర్తించాలన్నారు. దేశంలో 200 భాషలుంటే అందులో 50 వరకు గిరిజన భాషలున్నాయని తెలిపారు. మైసూరు సీఐఐఎల్‌లో పనిచేసినప్పుడు తనకు గిరిజన భాషలపై పరిశోధనలు చేయాలన్న ఆసక్తి కలిగిందన్నారు.