తెలంగాణ

telangana

ETV Bharat / state

Padma Awards 2022: తెలుగు రాష్ట్రాల్లో.. ఆరుగురుని వరించిన పద్మాలు - Padma Awards latest 2022

Padma Awards 2022: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ 128 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాలలో.. పలు రంగాల్లో సేవలందిస్తున్న ఆరుగురికి పద్మ పురస్కారాలు వరించాయి.

Padma Awards 2022
పద్మ శ్రీ అవార్డు

By

Published : Jan 26, 2022, 7:20 AM IST

Padma Awards 2022: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దర్శనం మొగిలయ్య నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన వారు. పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరితరం కళాకారుడు. గ్రామీణ నేపథ్యంలో దశాబ్దాలుగా ఈ కళను నమ్ముకొని జీవించడంతో పాటు దానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు యత్నిస్తున్నారు.

నా కళకు జీవం... ఈ పురస్కారం

కిన్నెరమెట్ల కళ అత్యంత అద్భుతమైంది. నాతోనే అది అంతమవుతుందా అనే మనోవేదనతో ఉన్న సమయంలో... పద్మశ్రీ పురస్కారం వచ్చింది. దీని ద్వారా నా కళకు జీవం పోశారు. సీఎం కేసీఆర్‌ ఈ కళను గుర్తించి, పురస్కారాన్ని ఇవ్వడంతో అందరికీ తెలిసింది.

-మొగులయ్య

కోయదొరల ఇలవేల్పు కథకుడు

కోయదొరల ఇలవేల్పు కథకుడు సకిని రామచంద్రయ్యను ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన ఆయన గిరిజన వన దేవతలైన సమ్మక్క-సారలమ్మల జీవిత చరితను డోలి (డోలు) సాయంతో కోయ భాషలో అద్భుతంగా వర్ణిస్తారు. దాన్ని తెలుగులో పాటగా అందంగా మారుస్తారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర సమయంలో అందరికీ గుర్తుకొస్తారీయన. వనదేవతల చరిత వినాలనుకునే వారంతా ఇయన వద్దకు వచ్చి వివరాలు తెలుసుకుంటారు. కోయభాషకు అక్షర రూపం తీసుకురావాలని 2015లో అప్పటి భద్రాచలం ఐటీడీఏ పీఓ దివ్య ఆధ్వర్యంలో తోగ్గూడెంలో ఐదుగురు విశ్వవిద్యాలయాల ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఇందులో సకిని ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

పోలియో బాధితులను నడిపించారు!

నలభై ఏళ్లుగా పోలియో బాధితులకు సేవలు అందిస్తున్న డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు(82) ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో ప్రముఖ వైద్యుడిగా పేరుగడించారు. భీమవరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో సుంకర శేషమ్మ, కనకం దంపతులకు జన్మించారు. 1961-66లో ఏయూలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశాక, అక్కడే ఆర్థోపెడిక్‌ సర్జరీలో ఎమ్మెస్‌ చేశారు. జర్మనీలో శస్త్రచికిత్సలపై శిక్షణ పొందారు. ‘సర్జరీ ఆన్‌ పోలియో డిజెబిలిటీ’ పుస్తకం రాశారు. ఆదినారాయణరావు కేజీహెచ్‌లో ఎముకల విభాగాధిపతిగా, సూపరింటెండెంట్‌గా, ఆంధ్రవైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా, వైద్య విద్యాశాఖ సంచాలకుడిగా సేవలందించారు. ఆయన సతీమణి డాక్టర్‌ శశిప్రభ కేజీహెచ్‌ పర్యవేక్షకురాలిగా పనిచేస్తున్నారు.

భద్రాద్రి రాముడికి నాదస్వర సుప్రభాత సేవకుడు

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామానికి చెందిన నాదస్వర విద్వాంసుడు దివంగత షేక్‌ హసన్‌సాహెబ్‌కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన 93 ఏళ్ల వయసులో 2021 జూన్‌లో మరణించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన సన్నాయి వాయిద్య కళను పుణికిపుచ్చుకొన్న హసన్‌.. కర్ణాటక సంగీతంలో విశేష అనుభవం సంపాదించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో షేక్‌ చినమౌలానా, ప్రకాశం జిల్లా కరువాదికి చెందిన షేక్‌ చినమౌలానా వద్ద శిక్షణ పొంది, 1954లో ఆలిండియా రేడియోలో నాదస్వర విద్వాంసుడిగా చేరారు. 1981లో భద్రాచలం ఆలయంలో నియమితులయ్యాక.. నాదస్వర సుప్రభాత సేవతో భద్రాద్రి సీతారాముల వారికి సేవలందించారు. యాదాద్రి ఆలయంలోనూ పనిచేశారు.

పద నర్తనకు పద్మశ్రీ

కూచిపూడి నృత్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డికి పద్మ పురస్కారం వరించింది. 1967లో ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు. తండ్రి జీవీరెడ్డి వైద్యుడు, తల్లి స్వరాజ్యలక్ష్మి గృహిణి. ఆమె నిజామాబాద్‌ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కేశ్‌పల్లి (గడ్డం) గంగారెడ్డి చిన్నకోడలు. ఐదేళ్ల వయసులోనే నర్తకి శోభానాయుడు వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చారు. ‘నృత్య విశారద, కల్కి కళాకార్‌, సంగీత నాటక అకాడమీ’ పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న తొలి మహిళా కళాకారిణిగా గుర్తింపు దక్కించుకున్నారు.

అవధాన ఘనాపాటి.. గరికపాటి!

అవధాన ప్రక్రియలో ప్రసిద్ధులైన గరికపాటి నరసింహారావును పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన పుట్టినిల్లు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం. వెంకటసూర్యనారాయణ, రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబరు 14న జన్మించిన నరసింహారావు ఎంఏ, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. భార్య శారదది తూర్పు గోదావరి జిల్లా. తెలుగు భాష, ఉచ్ఛారణ, వ్యాకరణం, సంప్రదాయ అంశాలపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. నేటి తరాన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహితీ ప్రసంగాలతో మురిపించిన ఆయన దేశవ్యాప్తంగా సత్కారాలు అందుకున్నారు. కాకినాడలో తొలుత స్నేహితులతో కలిసి కోనసీమ జూనియర్‌ కళాశాలను స్థాపించారు. తర్వాత సొంతంగా గరికపాటి జూనియర్‌ కళాశాల నెలకొల్పారు. చైతన్య కళాశాలలో తెలుగు, సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేశారు. 275 అష్టావధానాలను అవలీలగా నిర్వహించిన గరికపాటి.. ఆయన ‘సాగరఘోష’ పుస్తకాన్ని రచించారు.

ఇవీ చూడండి:Padma Sri Award To Mogilayya: కిన్నెర రాగానికి పులకరించి.. మొగిలయ్యను వరించిన పద్మశ్రీ..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details