కేసీఆర్, కేటీఆర్‌కి భాజపా భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వారిద్దరికి రాత్రి పూట నిద్రపట్టడం లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు తెలంగాణ రాజకీయాలు ఇంకా ఒంటపట్టలేదని విమర్శించారు. హైదరాబాద్ లక్డీకపూల్లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో లక్ష్మణ్ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ డైరీని ఆయన ఆవిష్కరించారు.
'భాజపాకు 2019 సంవత్సరం బాగా కలిసొచ్చింది' - BJP
హైదరాబాద్ లక్టీకపూల్లోని ఓ హోటల్లో భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమకు 2019 సంవత్సరం దేశవ్యాప్తంగా బాగా కలిసొచ్చిందని స్పష్టం చేశారు.
2019 సంవత్సరం దేశవ్యాప్తంగా భాజపాకు కలిసి వచ్చిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా పూర్తి మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఉత్తర తెలంగాణలో భాజపా బలపడిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచామని... తెరాస అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
గ్లోబరినా సంస్థ నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించామని వివరించారు. యాదాద్రి దేవాలయంపై బొమ్మలు చెక్కి.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని... ఆ బొమ్మలు తీసివేసేంత వరకు భాజపా పెద్ద ఎత్తున ఉద్యమించిందన్నారు.