అమరావతి అది పేరు కాదు.. ఆంధ్రుల అణువణువునా జ్వనించే నాదం. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని కోసం రాష్ట్రమంతా రైతులు పరిచిన పచ్చని ఉద్యమమే అమరావతి. త్యాగాన్ని.. పోరాటశక్తిగా మలిచి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో బతకాలని రైతులు నాటిన ఉద్యమం అమరావతి. ఎన్నో కష్టాలు.. నష్టాల కోర్చి ప్రతి అడుగో సమరమై.. నినాదమే శ్వాసై.. దీక్షే ఆయువై 200 రోజులైంది ఈ ప్రజాఉద్యమాన్ని మొదలుపెట్టి.
ఈ ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. జైల్లో పెట్టినా వెన్ను చూపని వీరుల్లా దీక్షను కొనసాగిస్తున్నారు రైతులు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం.. ఆంధ్రుల హక్కులను చిదిమేసే నిర్ణయం. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని సమూలంగా కాల్చేసిన సాక్ష్యం.
ఈ తప్పుడు నిర్ణయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాలని అమరావతి పోరు మొదలుపెట్టారు రైతులు. ఆ ఉద్యమానికి నేటికి సరిగ్గా 200 రోజులు. అందుకే అమరావతి కోసం ఆంధ్ర కదిలింది. బంగరు పంటలు పండే భూములను నయా పైసా లేకుండా రాజధానికి ఇచ్చేసిన రైతుల త్యాగం వృథా కానీయకుండా ప్రతి తెలుగు బిడ్డ కదిలాడు. ప్రపంచం నలుమూల విస్తరించిన ప్రతి ఎన్నారై ఆంధ్రుడు మీతో నేనున్నానంటూ తన సంఘీభావం తెలిపారు. కోవిడ్ కష్టాల్లోను ఒక రాష్ట్రం ఒకే రాజధాని అంటూ ప్రపంచం మొత్తం ప్రతి మూల నుంచి అమరావతి నినాదం వినిపించింది.
చిరుదివ్వెలా మొదలైన ఆలోచన ఖండంతారాలకు పాకిందిలా...
వేలమంది రైతులు సుదీర్ఘంగా చేస్తున్న నిర్విరామ ఉద్యమం ఇది. వారి తెగువ, ఆవేదనకు అందరూ అండగా నిలుస్తున్నారు ఎన్నారైలు. రైతు బిడ్డలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన ఆంధ్రులు అమరావతి రైతులతో గొంతు కలిపారు. రైతుల పోరాటానికి 200 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రముఖ ఎన్నారై జయరాం కోమటి అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలుద్దాం అని అమెరికాలోని ఎన్నారైలందరికీ పిలుపునిచ్చారు.
200 రోజులకు చిహ్నంగా 200 నగరాల్లో నిరసన తెలుపుదాం అనుకుంటే అది అమెరికాలోనే 230 నగరాలు అయ్యింది. మిగతా ఖండాల్లో ఉన్న ఎన్నారైలు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. చిరుదివ్వెలా మొదలైన ఆలోచన ప్రచండ భానుడిలా మారింది. దీంతో ఒక్కో ఎన్నారై అందరినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 నగరాల్లో భారీ ఎత్తున ఎన్నారైలు కదిలివచ్చారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అమరావతే ..మా సంకల్పం అంటూ..పోరాటానికి మద్ధతునిస్తున్నారు.