తరుణి స్వచ్ఛంద సంస్థ 20 ఏళ్ల వార్షికోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఓ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 20 ఏళ్లుగా తరుణి సంస్థ రాష్ట్రంలో బాల్య వివాహాలు, భ్రుణ హత్యలు, బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు విశేషంగా కృషి చేస్తుందని డీజీపీ అన్నారు. బాలిక సంఘాలు సైతం ఏర్పాటు చేసి 17 వేల మంది బాలికల జీవితాల్లో వెలుగు నింపిందన్నారు. సమాజంలో మార్పునకు ఎవరో ముందుకు రావాలని కాకుండా ఆ బాధ్యతను సంస్థ వ్యవస్థాపకురాలు డా.మమతా రఘువీర్ తీసుకుని పోరాటాలు చేసిందన్నారు.
ఎన్నో ఆటుపోట్లు
ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ బాలికల అభ్యున్నతికి కృషి చేసిందని ఐఏఎస్ పార్థసారథి అన్నారు. తరుణి సాధించిన విజయాలకు ఈ కార్యక్రమం ఒక సూచిక అని పేర్కొన్నారు. తోటి వ్యక్తికి కష్టం వస్తే చలించే వ్యక్తి మమత అని కొనియాడారు. బాలలు, స్త్రీల అభివృద్ధి, హక్కుల సాధన కోసం తరుణి సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఆ సంస్థ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో 'మమతానురాగల తరుణి' పుస్తకాన్ని ఆవిష్కరించారు.