పేదరికం, పూట గడవని పరిస్థితి తదితర కారణాలతో కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు వృద్ధులూ పలుగు, పార పట్టి పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో 81 ఏళ్లు దాటిన దాదాపు 97 వేల మంది ఉపాధి హామీ పనులకు వెళ్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కూలీల్లో 20 శాతానికిపైగా 60 ఏళ్లకు పైబడిన వారున్నారు.
కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో జనం ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. చాలా మంది పట్టణాలు వదిలి సొంతూళ్లకు వెళ్లిపోయారు. అక్కడ ఉపాధి హామీ పథకంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో 2020-21లో 1.13 లక్షల కుటుంబాలు కొత్తగా ఈ పథకంలోకి వచ్చాయి. ఉపాధి హామీ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి తప్పక 150 రోజుల పని కల్పించాలి.