గ్రేటర్‌లో కరోనా విజృంభణ ఆగట్లేదు. వారం రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 100కు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోనూ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా ఈ జిల్లాలో 13, గ్రేటర్ పరిధిలో 189 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 133, శనివారం 179, ఆదివారం 195.. సోమవారం కూడా అదే స్థాయిలో మహమ్మారి విరుచుకుపడింది. వైద్యులపై పంజా విదిల్చింది.
వైద్యులనూ వదలట్లేదు
సోమవారం నమోదైన కొవిడ్ పాజిటివ్ కేసుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది వైద్యులు ఉన్నారు. రెండు, మూడు నెలలుగా వైరస్ బాధితులకు సేవలు అందిస్తున్న ప్రాణదాతలను మహమ్మారి వదలడం లేదు. పేట్లబురుజు ఆసుపత్రిలో శుక్ర, శనివారాలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వైద్యులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 14 మంది వైద్యులు, 18 మంది పారిశుద్ధ్య, సహాయక సిబ్బందికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయింది. అమీర్‌పేట్ ప్రకృతి వైద్య చికిత్సాలయంలోనూ ఇద్దరు వైద్యులు వైరస్ బారిన పడ్డారు. ఇటీవల ఈ ఇద్దరు వైద్యులు ఓ వైరస్ బాధితుడికి దగ్గరగా ఉండి సేవలు అందించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అనంతరం ఇద్దరు వైద్యులకు చేసిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. రెండ్రోజులుగా వీరిలో ఒకరికి జ్వరం, దగ్గు లక్షణాలు బయట పడటంతో అనుమానం వచ్చి మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఈ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తోంది.