SSC Exams in Telangana : తెలంగాణలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాసేందుకు సరిపడా వయసు లేకున్నా ప్రత్యేక అనుమతి పొందుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా వయసులో చిన్నోళ్లు అయిన 18,491 మంది రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అయితే వారంతా మెడికల్ సర్టిఫికెట్, ప్రధానోపాధ్యాయుల సిఫారసు లేఖలతో ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల (డీఈవోలు) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. దాని కోసం ఒక్కొక్క విద్యార్థి రూ.300 ఫీజు కూడా చెల్లించారు.
అధిక శాతం ప్రైవేటు పాఠశాలలకు చెందినవారే : 2017లో ఇలాంటి వారు 14 వేల మంది ఉండగా.. క్రమేపీ వారి సంఖ్య పెరుగుతోందని పదో తరగతి బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు దాదాపు 4.86 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతుండగా.. వారిలో 3.8 శాతం మంది వయసులో చిన్నోళ్లు ఉన్నారు. వీరిలో 90 శాతానికి పైగా ప్రైవేటు బడులకు చెందిన వారేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులు పదో తరగతిని దృష్టిలో పెట్టుకొని ప్రవేశాల సమయంలోనే రిజిస్టర్‌లో వయసును రాస్తారని, ప్రైవేటులో అయితే అవగాహన లేకపోవడంతో పిల్లలను చేర్చుకుంటున్నారని.. అందుకే ప్రైవేటు బడుల్లో తక్కువ వయసున్నవారు ఉంటున్నారని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్లే స్కూళ్ల ద్వారా మూడేళ్ల వయసున్న పిల్లలను చేరుస్తున్నారు. దానివల్ల తక్కువ వయసులోనే పదో తరగతిలోకి విద్యార్థులు ప్రవేశిస్తున్నారు’ అని విద్యాశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.