Delay in Supply of Books to Schools : వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు నేడు పునః ప్రారంభం అయ్యాయి. పుస్తకాలు లేకుండానే విద్యార్థులు పాఠాలు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరం పరిధిలోని మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు 20 శాతం పుస్తకాలూ సరఫరా కాలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆంగ్ల మాధ్యమంలోకి మారిన పిల్లలకు పుస్తకాలు అందుబాటులో లేకపోతే ఇబ్బందులు తప్పేలా లేవు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 2.80 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరానికి మూడు జిల్లాలకు కలిపి 26,89,450 పుస్తకాలు అవసరమని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఇప్పటి వరకు 4.57 లక్షల పుస్తకాలే పాఠశాలలకు చేరుకున్నాయి.
విద్యార్థుల సంఖ్య పెరిగితే..
ఈసారి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టనున్న నేపథ్యంలో ఒకవైపు ఆంగ్ల పాఠాలు.. మరోవైపు తెలుగు పాఠాలు ఉండేలా ముద్రిస్తున్నారు. కాగితం కొరత కారణంగా ముద్రణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెండేళ్లుగా కరోనా పరిస్థితులు, ఆర్థిక అవస్థలతో మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాయి. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల వలసలు అధికంగా ఉంటే.. పాఠ్య పుస్తకాల సర్దుబాటు చేయడం మరింత కష్టంగా మారనుంది.
నెలాఖరుకల్లా అందిస్తాం..'పుస్తకాలను ఇప్పటికే జిల్లాల వారీగా పంపిస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి జిల్లాల డిమాండ్‌కు అవసరమైన పుస్తకాలన్నీ సరఫరా చేస్తాం.' -శ్రీనివాసాచారి, సంచాలకుడు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం