Telangana Dalita Bandhu Budget 2023-24 : స్వతంత్ర భారతదేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు, దాడులకు గురవుతూనే ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతమేరకు వెలుతురు ప్రసరించిందని తెలిపారు. ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదని..ఫలితంగా నేటికీ దళితవాడలు వెనుకబాటుతనానికీ, పేదరికానికీ చిరునామాలుగానే ఉండిపోతున్నాయని వెల్లడించారు.
Telangana Dalita Bandhu Budget 2023 : 'అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే దళితబంధు. దళితజాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి రూపుదిద్దారు. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. దళితబంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా.. ఆ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడటానికి తోడ్పడుతుంది. దళిత సోదరులు వ్యాపార రంగంలోనూ ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తుంది. దళితబంధు పథకం కోసం ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.' అని హరీశ్ రావు అన్నారు.