శాంతిభద్రతలు, ట్రాఫిక్, ఇంటిలిజెన్స్‌కే పరిమితం కాకుండా పోలీసులు కరోనా, వరదల్లో ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు. కావాల్సిన దానికంటే తక్కువ సంఖ్యలో మానవ వనరులున్నా.. పోలీసులు మాత్రం వెనకడుగు వేయకుండా శ్రమిస్తున్నారు. పోలీస్ శాఖలో కొత్తనీరు చేరుతుండటం.... వారి పనికి మరింత అదనపు తోడు కానుంది.
కొత్తగా 16వేల మంది...
రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాల వల్ల దాదాపు 16వేల మంది కానిస్టేబుళ్లు పోలీస్ శాఖలో చేరారు. ఇటీవలే 9 నెలల శిక్షణ పూర్తి చేసుకొని పాసింగ్ ఔట్ పరేడ్ ముగించుకున్న వీళ్లందరికీ పోస్టింగులు ఇచ్చారు. కమిషనరేట్లు, జిల్లాల వారీగా అవసరాలను బట్టి పోస్టింగులు ఇచ్చారు. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్‌కు దాదాపు 2వేల మందిని కేటాయించారు. ఆ తర్వాత సైబరాబాద్ కమిషనరేట్‌కు 1461 మంది కానిస్టేబుళ్లు రాచకొండ కమిషనరేట్‌కు 1394 మందిని కేటాయించారు. కొత్తగా విధుల్లో చేరిన వాళ్లతో కమిషనర్లు ప్రత్యేకంగా సమావేశమై... వాళ్లను విధులకు ఆహ్వానించారు. విధుల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి.... ఎలా సక్సెస్ సాధించాలనే విషయంలో కానిస్టేబుళ్లకు స్ఫూర్తినిచ్చేలా ప్రసంగించారు.